
పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వాలి
రైతు సంఘం నాయకుల డిమాండ్ యడ్లపాడులో పత్తి రైతుల సమావేశం అక్టోబర్ 9న నరసరావుపేటలో జిల్లా స్థాయి సదస్సు
యడ్లపాడు: పత్తికి మద్దతు ధర నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుడటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. స్థానిక పీఆర్ విజ్ఞాన కేంద్రంలో కల్లూరి రామస్వామి అధ్యక్షతన పత్తి రైతుల సమస్యలపై ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రాధాకృష్ణ మాట్లాడుతూ కనీస మద్దతు ధర కన్నా తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీనికి పరిష్కారంగా పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కి కేటాయించాల్సిన నిధులను తగ్గించడం, చివరకు దాన్ని రద్దు చేసి నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ఆలోచన రైతులను కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తుందని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర రూ.8,110 కాగా, రైతులు కోరుతున్నది మాత్రం సి2+50 ఫార్ములా ప్రకారం క్వింటాల్‌కు రూ.10,075 అని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ లేకపోవడం రైతులకు మరింత నష్టం చేకూరుస్తుందని అన్నారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై విధించే 11 శాతం సుంకాన్ని రద్దు చేయడం వల్ల దేశీయ మార్కెట్‌లో పత్తి ధరలు పడిపోతాయని, ఇది రైతులకు కోలుకోలేని దెబ్బ అని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అక్టోబర్ 9న నరసరావుపేటలో నిర్వహించనున్న పత్తి రైతుల జిల్లా సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి కల్లూరి రామస్వామి కన్వీనర్‌గా 9 మంది సభ్యులతో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు కల్లూరి రామారావు, శ్రీనివాసరెడ్డి, గోగడ హరిబాబు, నూతలపాటి సుబ్బరామమూర్తి, గురుస్వామి పాల్గొన్నారు.