
కొత్తరెడ్డిపాలెంలో సాధారణ జ్వరాలే..
డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
చేబ్రోలు: మండలంలోని కొత్తరెడ్డిపాలెంలో జ్వరాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కె. విజయలక్ష్మి తెలిపారు. గ్రామంలో ఆదివారం వైద్య సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ప్రబలిన జ్వరాలు, సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. సీజనల్ జ్వరాల ప్రభావం బలహీనంగా ఉన్న వృద్ధులు, పిల్లలపై ఉంటాయని తెలిపారు. అనారోగ్య సమస్యలున్న వారు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తురకపాలెం బాధితులు మరణించిన వైద్యశాలలో కొత్తరెడ్డిపాలేనికి చెందిన వ్యక్తి మరణించటంతో కలవరం మొదలైందని తెలిపారు. ఇక్కడ జ్వరాల బాధితులంతా సాధారణ మందులతో పూర్తిగా కోలుకున్నారని ఆమె పేర్కొన్నారు. వ్యాధి తీవ్రత అనుమానంతో రక్తపరీక్షలు చేయగా తొమ్మిది మందిలో నలుగురికి నెగిటివ్, ఐదుగురికి జలుబుకు సంబంధించిన స్టైపెలో కోకై లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. ఇక్కడ సాధారణ జ్వరాలు నమోదైనట్లు తెలిపారు. సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించామని, ఆదివారం రెండు జ్వరాల కేసులు వచ్చాయని చెప్పారు. గ్రామంలో మెడికల్ క్యాంపు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమలో పీహెచ్‌సీ వైద్యాధికారిణి వై. ఊర్మిళ, శైలజ, డెప్యూటీ ఎంపీడీవో రవిశంకర్, పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.