
బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ బాలికల చాంపియన్ గుంటూరు
బత్తలపల్లి: మండలంలోని రామాపురం జెడ్పీహెచ్‌ఎస్ మైదానం వేదికగా మూడు రోజులుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల 10వ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నీ ఆదివారం ముగిసింది. అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీ చాంపియన్ షిప్‌ను బాలుర విభాగంలో తూర్పు గోదావరి జిల్లా, బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్లు దక్కించుకున్నాయి. కాగా, ఆదివారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో హోరాహోరీగా సాగాయి. బాలుర విభాగంలో రెండో స్థానంలో చిత్తూరు, మూడో స్థానంలో శ్రీకాకుళం, నాల్గో స్థానంలో ప్రకాశం జిల్లా జట్టు నిలిచాయి. బాలికల విభాగంలో రెండో స్థానంలో విశాఖపట్నం, మూడో స్థానంలో తూర్పుగోదావరి, నాల్గో స్థానంలో శ్రీకాకుళం జట్లు నిలిచాయి. విజేతలకు ట్రోఫీలను ముఖ్యఅతిథులు అందించి, అభినందించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కోలాటంతో స్థానిక కళాకారులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ తలారి లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయులు వెంకటనాయుడు, రాష్ట్రబాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు విజయశంకర్‌రెడ్డి, చైర్మన్ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ బాలాజి, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, జనరల్ సెక్రటరీ వెంకటేష్, నాయకులు ధర్మవరం మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ అయ్యప్పనాయుడు, చిలకం మధుసూదన్‌రెడ్డి, నారాయణరెడ్డి, ఆకులేటి వీరనారప్ప, పురంశెట్టి రవి, గ్రామ పెద్దలు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్
చాంపియన్‌షిప్ పోటీలు