
ఏడాదిన్నర పాలనలో కార్మికులను వంచించిన కూటమి ప్రభుత్వం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబు సర్కార్ ఇకనైనా సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ జిల్లాలో సుమారు 80 వేల మంది కార్మికులు నేడు విజయవాడ కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి
ఎన్నికలు వచ్చాయంటే చంద్రబాబు నోటి వెంట అనేక హామీలు అవలీలగా వచ్చేస్తాయి. అన్ని వర్గాల వారిని మోసం చేయడానికి సంక్షేమ పథకాలు టీడీపీ మేనిఫెస్టోలో చకాచకా చేరుతాయి. కానీ అధికారంలోకి వచ్చాక అవన్నీ అటకెక్కుతాయి. ఇదే కోవలో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోలేదు. దీంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పేరు చెప్పి అధిక ధరలకు అమ్మకాలు సాగించడంతో భవన నిర్మాణాలు ఆగిపోయాయి. దీంతో ఆ రంగంపై ఆధారపడిన అనేక మందికి పని కరువైంది. జిల్లాలో సుమారు 80 వేల మంది భవన, ఇతర నిర్మాణ కార్మికులు ఉన్నారు. తాపీ, ఎలక్ట్రిక్, ప్లంబింగ్, కార్పెంటర్ పెయింటర్, రాడ్ బెండింగ్, సెంట్రింగ్, టైల్స్, మార్బుల్స్, కంకర, ఇసుక, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సీలింగ్, మట్టి పని చేసేవారు ఇందులో ఉన్నారు.
అతీగతీలేని ఎన్నికల వాగ్దానాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా స్వయంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వాగ్దానాలు అతీగతీ లేకుండా పోయాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులకు అండగా ఉంటామంటే నమ్మామని, కానీ అధికారంలోకి వచ్చాక ఇలా చేయడం ఎంత వరకు సబబు అని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం రాగానే సంక్షేమ బోర్డు పునరుద్ధరించి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పిన పాలకులు ఇప్పుడు నోరు మెదపడం లేదని వాపోతున్నారు. కనీసం నేటికీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదంటున్నారు. గతంలో ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చి తమ సమస్యలను అసెంబ్లీ సమావేశాలో ప్రస్తావించాలని కోరినా ఫలితం శూన్యమేనని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరినా ఎమ్మెల్యేలు కనీస ప్రస్తావన కూడా చేయలేదంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి వేల సంఖ్యలో భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికులు ఈ నెల 15వ తేదీన విజయవాడ కార్మికశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి తరలిరానున్నట్లు చెప్పారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి
వెల్ఫేర్ బోర్డు కోసం లక్షల మంది భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో స్వయంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఈ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటి వరకు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు. ఇప్పుడైనా కష్ట జీవులైన భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు మేలు చేస్తూ ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి. కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చర్యలు చేపట్టాలి.
– అవ్వారు ప్రసాదరావు,
సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు, పల్నాడు

ఏడాదిన్నర పాలనలో కార్మికులను వంచించిన కూటమి ప్రభుత్వం

ఏడాదిన్నర పాలనలో కార్మికులను వంచించిన కూటమి ప్రభుత్వం