
ప్రభుత్వానికి రైతుల సమస్యలపై శ్రద్ధలేదు
నరసరావుపేట: కూటమి ప్రభుత్వానికి మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయటంలో ఉన్న శ్రద్ధ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై లేదని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అప్రమత్తం చేసి కళ్లు తెరిపించే ఉద్దేశంతో పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10గంటలకు అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రైతులు యూరియా కోసం రోడ్డుమీద పడి కాపు కాయాల్సి వస్తుందన్నారు. బ్లాక్ మార్కెట్‌లో యూరియా అధిక ధరకు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయశాఖ నిద్రపోతున్నట్లుగా ఉందని, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా, లేడా అనే అనుమానం ప్రజల్లో తలెత్తుతుందన్నారు. అధికారులు యూరి యాకు కొరత లేదని పదే పదే ప్రకటనలు ఇస్తున్నారని, యూరియా ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నించారు. వాస్తవానికి దళారుల చేతుల్లో యూరియా ఉందని, ప్రభుత్వం, అధికారులు దళారులకు బానిసలు అయ్యారని పేర్కొన్నారు. రైతుల్ని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం, నాయకులైన బాగుపడ్డ చరిత్ర లేదని అన్నారు. ఇప్పటికై నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతు సమస్యలను పరిష్కరించాలని కోరారు. శాంతియుత నిరసన ర్యాలీ అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం ఇవ్వటం జరుగుతుందన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, రైతు కూలీలు, రైతు సంఘ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
రేపు అన్నదాత పోరు జయప్రదం చేయండి
వైఎస్సార్ సీపీ రైతు విభాగం
జిల్లా అధ్యక్షులు పున్నారెడ్డి