
ఘనంగా కళా ఉత్సవం
విద్యార్థుల ప్రతిభకు వేదికగా నిలిచిన వేడుక
యడ్లపాడు: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) కళాశాల విద్యార్థులతో కళకళలాడింది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గురువారం కళా ఉత్సవం –2025 పోటీలు ఘనంగా జరిగాయి. గురు, శుక్రవారాల్లో ఆరు కళలకు సంబంధించి 12 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా గాత్రం, శాసీ్త్రయ సంగీతం (సోలో – గ్రూప్), నాట్యం (సోలో – గ్రూప్), వాయిద్య సంగీతం, థియేటర్, డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్ వంటి అంశాల్లో వివిధ పాఠశాలలకు చెందిన 200 మంది తమ ప్రతిభను ప్రదర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారి, డైట్ కళాశాల ప్రిన్సిపల్ ఎల్ చంద్రకళ పర్యవేక్షణలో కార్యక్రమ నిర్వహణకు డాక్టర్ ఎన్ విమలకుమారి నోడల్ అధికారిగా, న్యాయ నిర్ణేతలుగా పలువురు ప్రముఖులు వ్యవహరించారు. ఉత్సవాల రాష్ట్ర పరిశీలకులు కల్పన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులలో కళానైపుణ్యాలను వెలికితీయడానికి, సంస్కృతి– సంప్రదాయాలపై అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ మాట్లాడుతూ విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశామని తెలిపారు. పాల్గొన్న అందరికీ ధ్రువపత్రాలను అందజేశామని పేర్కొన్నారు. డిప్యూటీ డీఈవో ఎస్‌ఎం సుభాని మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్య ప్రదర్శనకు, కళా రంగంలో మరింత ముందుకు వెళ్లడానికి చక్కటి వేదికగా కార్యక్రమం నిలిచిందన్నారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు వై.శ్రీనివాసరావు, ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కళా ఉత్సవం