
కలెక్టర్ గారూ.. కష్టాలు తీర్చరూ..
రెవెన్యూ సమస్యలతో సతమతం
● జిల్లా నూతన కలెక్టర్
కృతికా శుక్లాకు సమస్యల స్వాగతం
● కూటమి పాలనలో కుంటుపడిన
జిల్లా అభివృద్ధి, సంక్షేమం
సాక్షి, నరసరావుపేట: ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా చేసిన అనుభవంతో జిల్లా భౌగోళిక స్వరూపంపై ఇప్పటికే కృతికా శుక్లాకు అవగాహన ఉంది. వ్యవసాయాధారిత జిల్లా అయిన పల్నాడులో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 20 రోజులుగా యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో పంటలకు సరైన మార్కెటింగ్ కల్పిస్తే ఎంతో మేలు చేకూరనుంది.
పడకేసిన విద్య, వైద్యం...
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్కార్ వైద్యరంగానికే జబ్బు చేసింది. జిల్లాలోని నరసరావుపేట ఏరియా వైద్యశాలతోపాటు పీహెచ్‌సీలలో సమస్యలు తిష్ట వేశాయి. దీనిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. గతేడాది అక్టోబర్‌లో దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని అంజనాపురం కాలనీ వాసులు పదుల సంఖ్యలో డయేరియాతో బాధపడ్డారు. ఇదే కాలనీలో మరణాలు కూడా సంభవించాయి. రక్షిత మంచినీరు సరఫరా చేయకపోవడంతో డయేరియా విస్తరించింది. జిల్లాలో జేజేఎం పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలకు మంచినీరు అందించడంలో వెనుకబాటు కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు, ట్యాబ్‌లు, ఇంగ్లిష్ మీడియం వంటి సంస్కరణలతో విద్యాభివృద్ధి పరుగులు పెట్టింది. దీనిపై దృష్టి పెడితే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరికల్లాంటి విద్యార్థులున్నారని గతేడాది పదోతరగతి ఫలితాల ద్వారా నిరూపితమైంది. జిల్లాలో కళాశాలలు లేని మండలాల్లో నూతనంగా ఏర్పాటు అయ్యేలా కృషి చేయాల్సి ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాల్సి బాధ్యత కలెక్టర్‌పై ఉంది. కూటమి వచ్చాక జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
జిల్లా కేంద్రంపై దృష్టి అవసరం
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట అభివృద్ధి మందగించింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. పరిష్కారానికి గత ప్రభుత్వం మల్లమ్మ సెంటర్‌లో ఫ్లయ్ ఓవర్, చిత్రాలయ టాకీస్ వద్ద ఆర్‌యూబీ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై నూతన కలెక్టర్ దృష్టి సారిస్తే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది. జేఎన్‌టీయూ భవనాల పూర్తి, ఆటోనగర్ ఏర్పాటు, కోటప్పకొండ అభివృద్ధి వంటి పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. జిల్లా అభివృద్ధి తనదైన ముద్ర వేసి, అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
వారం వారం జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజాఫిర్యాదులలో అధిక భాగం రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో వాటి పరిష్కారంలో తాత్సారం జరుగుతోంది. మరోవైపు సిబ్బంది, అధికారులు లంచాలు తీసుకుని సమస్యలు తీర్చకపోగా కొత్తవాటిని పుట్టిస్తున్నారనే అపవాదు ఉంది. భూముల రీసర్వే, అగ్రహారం భూముల సమస్యలను తీర్చాల్సి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ గాడి తప్పింది. సచివాలయ సిబ్బంది సేవలను సరైన రీతిలో వాడుకుంటే ప్రజలకు ఎంతో మేలు చేకూరనుంది. జిల్లా వరప్రదాయినిగా పిలిచే వరికపూడిసెల ప్రాజెక్టు పనుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఈ ప్రాజెక్టు పనులు పురోగతి సాధించేలా జిల్లా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంది.

కలెక్టర్ గారూ.. కష్టాలు తీర్చరూ..