
కోటప్పకొండలో నిఘా పెంచాలి
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న దోపిడీ ఘటనలపై పోలీసులు దృష్టి సారించారు. దోపిడీలతో భీతిల్లుతున్న పేట ప్రజలు పేరుతో సాక్షి పత్రికలో వచ్చిన కథనంతో పోలీసుల్లో చలనం వచ్చింది. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కోటప్పకొండ ప్రాంతంలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబుతో కలిసి త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత శాంతిభద్రతలపై పోలీసు అధికారులతో సమీక్షించారు. అసాంఘిక కార్యక్రమాలు, దోపిడీలు జరగకుండా నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. డ్రోన్‌లను ఉపయోగించి కోటప్పకొండలో నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. యాత్రికులకు అసౌకర్యం కలగకుండా ఇద్దరు సిబ్బందితో బీట్ ఏర్పాటు చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, పేకాట నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోటప్పకొండ గిరిప్రదక్షిణ రహదారి, కొండ ప్రాంతంలో పోలీసు సిబ్బందితో రూరల్ ఎస్‌ఐ కిషోర్ పరిశీలించారు. అలాగే జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ యల్లమంద గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి అసాంఘిక కార్యక్రమాల గురించి ఆరా తీశారు.
● జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశం
● యల్లమందలో అదనపు ఎస్పీ పర్యటన

కోటప్పకొండలో నిఘా పెంచాలి