
ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కూటమి
పోలీసుల అదుపులో సోషల్ మీడియా కార్యకర్త
వినుకొండ: రాష్ట్రంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలిపే హక్కుకూడా లేకుండా ప్రజల ప్రాథమిక హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తూ, దుర్మార్గమైన పాలన సాగిస్తోందని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వినుకొండలోని తన కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బొల్లా బ్రహ్మనాయకుడు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసినవారిపై కూడా అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటిని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటున్న వినుకొండ నియోజకవర్గానికి చెందిన అబ్బూరి శ్రీనివాసరావు సోషల్‌మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారని అక్రమ కేసు నమోదు చేయడం విడ్డూరమన్నారు. అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, ఈపూరు పోలీస్టేషనుకు తరలించి ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమన్నారు. కూటమి నేతలు పాలనను గాలికొదిలి అబద్దాలతో కాలం గడుపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం జరుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించారు. అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్న సామాన్యులను సైతం వదలకపోవడం విడ్డూరమన్నారు.
మాజీ ఎమ్మెల్యే
బొల్లా బ్రహ్మనాయుడు
దాచేపల్లి: శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామానికి చెందిన అబ్బూరి శ్రీనివాసరావు అనే సోషల్ మీడియా యాక్టివిస్టుని దాచేపల్లి పోలీసులు గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున హైదరాబాదులో అదుపులోకి తీసుకొని దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో ఇటీవల ఓ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోను అబ్బూరి శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసినట్లుగా నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ టీజె చంద్రశేఖర్ బాబు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాడి వీడియోలు అప్పటికే సామాజిక మధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశారనే అభియోగంతో శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
అబ్బూరి శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమం
సాక్షి,అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టు వినుకొండ నియోజకవ వర్గానికి చెందిన అబ్బూరి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం ప్రెసిడెంట్ పోశిం రెడ్డి సునీల్, రాష్ట్ర ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయభాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మందపాటి హరీష్‌రెడ్డిలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.