
ఎయిడ్స్‌పై అవగాహనకు మొబైల్ వాహనం
నరసరావుపేట: అవగాహన కల్పించడానికి రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లాకు అందజేసిన మొబైల్ ఐఈసీ వాహనం ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ మొబైల్ వాహనం ద్వారా ప్రజలకు వ్యాధిపై అవగాహన పెంచుతామన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ వాహనాన్ని జిల్లాకు కేటాయించినందుకు సంస్థకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం మేనేజర్ జానీబాషా, క్లస్టర్ ప్రెవెన్షన్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, ఐసీటీసీ కౌన్సిలర్ రవి, పీపీటీసీటీ కౌన్సిలర్ జ్యోతి సిబ్బంది పాల్గొన్నారు.
అధిక ధరకు ఔషధాల విక్రయం కేసులో ఒకరోజు జైలు
నరసరావుపేట టౌన్: ఔషధాలపై అధిక ధరను ముద్రించి విక్రయించినట్లు నేరం అంగీకరించడంతో సదరు కంపెనీ ప్రతినిధులైన రాజేష్ భాటియా, నవీన్ భాటియాలకు ఒక రోజు జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎ.సలోమీ శుక్రవారం తీర్పు వెలువరించారు. 2017లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రీమన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు కోపిర్జిన్ 750 ఎంజీ మందులను ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే అధిక ధరను ముద్రించి విక్రయించారు. ఫిర్యాదు అందటంతో అప్పటి నరసరావుపేట డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పారా శ్రీరామ్మూర్తి తనిఖీ చేసి కేసు నమోదు చేశారు. సదరు కంపెనీ ప్రతినిధులు ఇద్దరిపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రస్తుత డ్రగ్ ఇన్‌స్పెక్టర్ డి.సునీత ఆ నిందితులు కోర్టుకు హాజరయ్యేలా చర్యలు చేపట్టారు. నిందితులు నేరం అంగీకరించడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు.