
ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచిస్తున్న ప్రభుత్వం
ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ ఇబ్రహీం
సత్తెనపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం వంచిస్తోందని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ ఇబ్రహీం అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణ ‘నిరసన వారం’ రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సత్తెనపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఏపీటీఎఫ్ సత్తెనపల్లి మండలశాఖ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్‌ఖాన్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించటం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిందన్నారు. ఏపీ జేఏసీ నాయకుడు ఎస్.అంబేడ్కర్, జిల్లా ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి కాల్వపల్లి శివారెడ్డి, అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్‌లు మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ కేఎస్ చక్రవర్తికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ బాధ్యులు కె.ఉషారాణి, అక్తరున్నిసా, వంజ సునీల్‌కుమార్, భవనం సుబ్బారెడ్డి, లెనినారాణి, దామోదరం, రేపూడి చిన్నపిచ్చయ్య, ప్రభావతి, ధర్మారావు, నీలం చంద్రం, పి.మారుతిరమేష్, దాసరి రవికుమార్, షేక్ జిలాని, ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.