
ఎరువుల అక్రమ రవాణాను సహించం
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు కారెంపూడిలో ఎరువుల దుకాణాల గోడౌన్లలో తనిఖీలు
కారెంపూడి: పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు కారెంపూడి మండలంలో మంగళవారం పర్యటించారు. కారెంపూడిలో ఎరువుల దుకాణాల గోడౌన్లలో స్టాకును తనిఖీ చేశారు. సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల సరఫరా, రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన అక్రమాలలో భాగస్వాములయ్యేవారిపై కఠన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాకు రిజిష్టర్లు ఈ పాస్ మిషన్లలో ఉన్న ప్రకారం స్టాకు నిల్వలుండాలన్నారు. తప్పని సరిగా స్టాకు నిల్వల బోర్డులు రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు.
వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో రైతులకు సరిపడా అన్ని రకాల ఎరువులు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏ ఎరువు కూడా కొరత రాకూడదని కొంచెం నిల్వలుండగానే ఇండెంటు పెట్టుకోవాలని సూచించారు. ముందుగా ఒప్పిచర్ల జెడ్పీ హైస్కూల్ తరగతి గదికి వెళ్లి బోధన తీరును పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం కారెంపూడి పీహెచ్‌సీని సందర్శంచి, డాక్టర్లు, సిబ్బంది రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, డీఈఓ చంద్రకళ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు, డీఎంహెచ్‌ఓ రవి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, ఎస్‌ఐ వాసు ఉన్నారు.