
బదిలీ ఉపాధ్యాయుల వేతనాలు నేటికీ చెల్లించకపోవటం శోచనీయం
రేపల్లె: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో బదిలీపై వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు జూన్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లించకపోవడం శోచనీయమని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిలర్ తేలప్రోలు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. రేపల్లెలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉపాధ్యాయులు నెలల తరబడి వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయుల పొజిషన్ ఐడీలు ఇంకా క్రియేట్ చేయకపోవడం వల్ల జీతాలు అందించే ప్రక్రియ ఆగిపోయిందని, ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరం కిందటే దరఖాస్తు చేసిన సరెండర్ లీవ్ బిల్లులు ఇప్పటికీ ఉపాధ్యాయుల ఖాతాల్లోకి జమ చేయకపోవడం వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం, అధికారులు ఉపాధ్యాయుల సమస్యను వెంటనే పరిష్కరించటంతోపాటు జీతాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిలర్
శ్రీనివాసరావు