
జీవితాన్ని తీర్చిదిద్దిన బైరాగి కవిత్వం
తెనాలి: తెలుగు, హిందీ భాషల్లో గొప్ప రచనలు చేసిన ఆలూరి బైరాగి సాహిత్యం తన జీవితాన్ని మలుపు తిప్పిందని, ఎదగటానికి ఉపయోగపడిందని ప్రసిద్ధ రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. యువకుడిగా విద్యారంగమా, రాజకీయమా? అనే సంశయాత్మక పరిస్థితుల్లో ఉన్నపుడు గురువు ఆదేశ్వరరావు ద్వారా పరిచయమైన ఆలూరి బైరాగి కవిత్వం తనను ఉన్మాదుడిని చేసిందన్నారు. హిందీ, తెలుగు సాహిత్య రంగాలపై దృష్టి పెట్టి ఒక స్థాయిని సాధించగలిగానని చెప్పారు. సాహిత్య అకాడమీ, పట్టణానికి చెందిన సమరయోధుడు వడ్లమూడి గోపాలకృష్ణయ్య, వెంకటలక్ష్మమ్మ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ఆదివారం ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో తెనాలికి చెందిన ప్రసిద్ధ రచయితలు ఆలూరి బైరాగి, శారదల శతజయంతి సదస్సు నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ బాబు ఆర్.వడ్లమూడి అధ్యక్షత వహించారు. ఇందులో ఆచార్య లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. కవిత్వం సహా వివిధ ప్రక్రియల్లో బైరాగి శైలిలో రచనలు చేసిన హిందీ కవులు ఎవరూ లేరని చెప్పారు. బైరాగి హిందీ సాహిత్యంపై సాహిత్య అకాడమీ సదస్సుకు కృషి చేస్తానని చెప్పారు. బైరాగి స్వస్థలమైన తెనాలిలో ప్రతిష్టకని రూ.1.30 లక్షలతో చేయించిన కాంస్యవిగ్రహాన్ని బహూకరించినట్టు గుర్తుచేశారు.
‘బైరాగి’ సాహిత్య స్వరం విలక్షణం
బైరాగి జీవితం, సాహిత్యంపై ప్రముఖ రచయిత డాక్టర్ పాపినేని శివశంకర్ మాట్లాడుతూ ద్విభాషా పండితుడైన బైరాగిది తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైన స్వరంగా చెప్పారు. ఎన్నెన్నో అధ్యయనాలు చేసినా తగిన మార్గం నిర్దేశించుకోలేక నిరంతర అన్వేషణ యాత్రికుడిగానే మిగిలి పోయారని అన్నారు. తన కవితా భాషను తానే తీర్చిదిద్దుకున్న బైరాగిలా ఆయన సమకాలికులు ఎవరూ రచనలు చేయలేదన్నారు.
గొప్ప సీ్త్రవాది శారద
ప్రముఖ రచయిత
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
ఘనంగా ఆలూరి బైరాగి,
శారదల శతజయంతి సదస్సు
శారద జీవితం, రచనలపై ‘అరసం’ జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజాపక్ష ఉద్యమాలను తన కథల్లో ప్రతిబింబించిన శారద గొప్ప సీ్త్రవాదిగా చెప్పారు. కార్మికోద్యమాలను విజయాకాంక్షతో చూశారన్నారు. ఆకలి, అనారోగ్యంతోనే అద్భుతమైన సాహిత్య సృజన చేసిన శారద 31 ఏళ్లకే చనిపోయినట్లు పేర్కొన్నారు. శారద మరణాన్ని పాలకులు, ప్రచురణకర్తలు చేసిన హత్యగానే భావించాలని అభిప్రాయపడ్డారు. శారద తెలుగు రచయిత మాత్రమే కాదు...జాతీయ రచయితగా చెబుతూ, శాశ్వత స్మారకం ఉండాలన్నారు. శారద జన్మస్థలి పుదుక్కోటలో స్మృతిచిహ్నం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. సాహిత్య అకాడమీ ప్రోగ్రాం అసిస్టెంట్ టీఎస్ చంద్రశేఖరరాజు స్వాగతం పలుకగా, తెలుగు సలహామండలి సభ్యుడు వల్లూరు శివప్రసాద్, ‘శారద’ కుమార్తె శారద, అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు మాట్లాడారు. తర్వాత జరిగిన రెండు సదస్సులకు కొత్తపల్లి రవిబాబు, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అధ్యక్షత వహించారు. ఆలూరి బైరాగి, శారద సాహిత్య ప్రక్రియలపై కందిమళ్ల శివప్రసాద్, కొర్రపాటి ఆదిత్య, పేరిశెట్టి శ్రీనివాసరావు, కె.శరచ్ఛంద్ర జ్యోతిశ్రీ , చెరుకూరి సత్యనారాయణ పత్రసమర్పణ చేశారు.