
వరుణా.. ఎంత పనిచేశావ్!
యడ్లపాడు: సీజన్ ఆరంభానికి ముందే కురిసి, తీరా అదును సమయానికి ముఖం చాటేసిన వరుణుడు, ఇప్పుడు కుండపోత వర్షాలతో రైతుల ఆశలను అడియాశలు చేశాడు. శుక్ర, ఆది, సోమవారాల్లో 76.2 మీమీ వర్షపాతం కురవడంతో రెండు పంటలు సాగు చేయాలన్న మండల రైతులకు రెండో పంట సంగతి ఏమోగాని, ప్రతీ రైతు రెండసార్లు విత్తనా లు నాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలో ఉప్పవాగు, కొండవాగులు ఉధృతమై ప్రవహించాయి. ఎప్పుడు నీటి జాడ కనిపించని నక్కవాగు, లింగారావు పాలెంలోని పడమర వాగులు సైతం నిండుగా పారాయి. వాగులు, వంకలు, కుంటలు నిండిపోయాయి. కుండపోత వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వాననీరు వరదగా మారి మండలంలోని దిగువ ప్రాంతాలపైకి విరుచుకుపడింది. ఇప్పటికే పత్తి విత్తనాలు విత్తుకున్న రైతులకు ఈ వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆయా గ్రామా ల్లోని పంట పొలాల్లో అక్కడక్కడా గండ్లు పడటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మరోవైపు సోమవారం రాత్రి లింగారావుపాలెంలో పడమర వాగు పొంగడంతో, వరద నీరు ఊరిని చుట్టుముడుతుందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన తో రాత్రంతా జాగారం చేశారు.
విత్తనాలు బొగిలి, మొలకలు కుళ్లి..
ముందస్తుగా యడ్లపాడు, లింగారావుపాలెం, సొలస, చెంఘీజ్‌ఖాన్ పేట, తిమ్మాపురం పత్తి విత్తనాలు వేసుకున్న పత్తి రైతులు వర్షాభావ పరిస్థితులు కారణంగా భూమిలో నాటుకున్న విత్తనా లు బొగిలిపోవడంతో రెండోసారి విత్తుకున్నారు. వీరికి ప్రస్తుతం కురిసిన కలిసి వచ్చినా రెండుసార్లు అచ్చుతోలి నాటుకున్న అధిక ఖర్చుల భారం మీద పడింది. ఇక కారుచోల, గుత్తావారిపాలెం, జగ్గాపురం, జాలాది గ్రామాల్లో వాగు, కుంటలు, బోర్ల కింద కొందరు పత్తి విత్తనాలు నాటారు. ఇవి మొలకలు వచ్చాయి.
అయితే శుక్రవారం నుంచి దశల వారీగా దంచికొట్టిన వానకు అవికూడా కుళ్లిపోవడంతో వీరు రెండో పర్యా యం విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల వర్షం వచ్చే సూచన్లు ఉన్నాయని తెలిసీ పత్తి విత్తనాలు నాటిన వారి పరిస్థితి అధిక వర్షంతో తేమశాతం ఎక్కువై నేలలోనే నాటిన గింజలు కుళ్లి పోతాయని తాము తప్పక తిరిగి మరోమారు విత్తుకోవాల్సిందేనని అలా నాటుకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక జాలాది పరిసర పొలాల్లో వర్షాలకు 15 రోజులకు ముందుగా ఎదబెట్టి జ్యూట్ విత్తనాలను సుమారు 50 ఎకరాలకు పైగా విత్తుకున్నారు. సోమవారం రాత్రి ఎగువ ప్రాంతాల నుంచి ఉధృతంగా ప్రవహించిన వరద నీరు కారణంగా జ్యూట్ విత్తనాలు కుళ్లిపోతాయని రైతులు చెబుతున్నారు. వీరు రెండోసారి విత్తనాలు ఎదబెట్టక తప్పదని పెదవిరుస్తున్నారు. ఇలా వర్షాభావంతో, వర్షం కురుస్తుందని కొందరు, వర్షం అధికమై మరికొందరు విత్తన దశలోనే చిత్తయిపోయారు. ఖరీఫ్ సీజన్‌లో రెండు పైర్లు సాగు చేయాలన్న ఆలోచన అటుంచి, రెండుసార్లు విత్తనాలు నాటుకోవాల్సిన పరిస్థితి మాత్రం రైతులకు తప్పడం లేదు.
వరద నీరు ప్రవాహమై ముంచెత్తిందిలా...
ఎగువ ప్రాంతాల నుంచి తిమ్మాపురం, దింతెనపాడు మీదుగా వచ్చిన పొలాల్లోని వరద నీరు కొల్లుగుంట నిండి గణేశునివారిపాలెం, సందెపూడి, తుర్లపాడు వైపుగా ప్రవహిస్తూ చివరకు కుప్పగంజి వాగులో కలుస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలకు ముందుగానే విత్తుకున్న పత్తి, జ్యూట్ విత్తనాలు కుళ్లిపోయాయి. అలాగే ఉన్నవ పొలాల్లోని వరద నీరంతా కారుచోల చెరువులోకి వచ్చి ఆ చెరువు అలుగు మీదుగా పారి యడ్లపాడు, జగ్గాపురం పొలాల పరిధిలోని బొల్లయ కాలువ మీదుగా జాలాది పంట పొలాల్లోకి చేరి అక్కడి నుంచి నక్కవాగులో కలుస్తుంది. ఆయా గ్రామాల్లో పొడివిత్తనాలు వేసుకున్న రైతుల పొలాల మీదుగా అత్యధిక వరదనీరు ప్రవహించడంతో మొలకెత్తిన, కొత్తగా విత్తుకున్న పత్తి విత్తనాలన్నీ కుళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పవాగు, కొండవాగులు ఉధృతం
యడ్లపాడు మండలంలో వరద ముంపులో పంట పొలాలు

వరుణా.. ఎంత పనిచేశావ్!