
డివైడర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
నరసరావుపేటటౌన్: ప్రయాణికులతో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే గడియార స్తంభం సెంటర్‌లో ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. పోలీసుల కథనం ప్రకారం.. షిర్డీలో మారుతి సుధాశ్రీ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని గుంటూరుకు బయలు దేరింది. మార్గమధ్యంలో తెల్లవారు జామున నరసరావుపేట గడియార స్తంభం వద్దకు వచ్చే సరికి ఆగి ఉన్న లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి బస్సు డివైడర్‌ను ఢీకొంది. సంఘటనలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. సంఘటనతో ట్రాఫిక్ నిలిచి పోయింది. సమాచారం అందుకున్న సీఐ లోకనాథం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.