
ఆలయ నిర్మాణానికి రూ.1.25 లక్షల విరాళం
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళీ అమ్మవారి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన అన్నపూర్ణ అన్నదాన కమిటీ సభ్యులు రూ.1,25,000లు విరాళంగా అందజేశారు. ఆలయ కార్యాలయంలో గురువారం ఈఓ నలబోతు మాధవీలతను కలిసి విరాళం చెక్కును దాతలు అందించారు. మహంకాళీ అమ్మవారి ఆలయం, వీరాంజనేయ స్వామి దేవస్థానంలో అన్నప్రసాదం సమర్పించే దాతలు ఈ విరాళం మొత్తాన్ని అందజేసినట్టు ఈఓ తెలిపారు.
కలెక్టర్ ఫొటోతో
నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్
ఎవరూ స్పందించవద్దన్న
కలెక్టర్ కార్యాలయం
నరసరావుపేట: జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు ఫొటోతో కొందరు కేటుగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించి, ఆ అకౌంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టరేట్ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో స్పందించాయి. డీసీ పల్నాడు అంటూ నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి కొందరు డబ్బులు డిమాండ్ చేస్తూ సందేశాలు పంపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి ప్రలోభాలకు ఎవరూ లొంగవద్దని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.
రేషన్ డీలర్లపై
నివేదిక ఇవ్వండి
డీటీలను ఆదేశించిన జేసీ సూరజ్
నరసరావుపేట: జిల్లాలో రేషన్ పంపిణీ సమయంలో డీలర్లు కార్డుదారులతో దురుసుగా వ్యవహరిస్తున్న విషయంపై డిప్యూటీ తహసీల్దార్లు ప్రతి రేషన్‌షాపును తనిఖీచేసి సంబంధిత కార్డుదారులతో మాట్లాడి తగిన నివేదిక అందజేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కార్డుదారుల ఐవీఆర్‌ఎస్ కాల్స్, దీపం పథకంలో గ్యాస్ డెలివరీ బాయ్స్ చార్జీల రూపంలో అధికంగా వసూలు చేస్తుండడంపై డీటీలతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు వారి డెలివరీ బాయ్స్‌కు అదనంగా డబ్బులు వసూలుచేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. లేనిపక్షంలో బీఫారం రద్దుచేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వీఎం ప్రసాదు పాల్గొన్నారు.
ఆంజనేయుడికి
శాకంబరి అలంకారం
నరసరావుపేట: పాలపాడు రోడ్డులోని శ్రీ చిన్న సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి వారి దేవాలయంలో గురువారం అమావాస్య సందర్భంగా స్వామివారిని అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలతో శాకంబరి అలంకారం చేశారు. కదలిఫలం, అరటిపండ్లతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
యోగా పోటీలకు మద్దిరాల జేఎన్‌వీలో సన్నాహాలు
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: ఈనెల 29వ తేదీ నుంచి దక్షిణ భారతస్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహరావు గురువారం తెలిపారు. ఏటా జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ పోటీలకు తమ విద్యాలయం వేదిక కానుందని తెలిపారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల్లోని జేఎన్‌వీ విద్యార్థులకు అండర్–14, అండర్–17, అండర్ –19 విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. 29,30,31 తేదీల్లో జరిగే పోటీలకు సౌత్‌జోన్ పరిధిలోని ఆయా విద్యాలయా ల నుంచి సుమారు 340 మంది విద్యార్థులు ఈ యోగా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

ఆలయ నిర్మాణానికి రూ.1.25 లక్షల విరాళం