
ఇక.. రెండు పూటల హాజరు
సత్తెనపల్లి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబు కార్డు కలిగిన శ్రామికులకు ఇకపై రెండు పూటలు హాజరు నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం, సాయంత్రం ఉపాధి శ్రామికుల చిత్రాలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆయా మస్టర్ల ఆధారంగానే కూలీలకు వేతనాలు చెల్లిస్తారు. ఉపాధి హామీ పనుల హాజరులో జరుగుతున్న అవకతవకలను నివారించేందుకు, పనులు పారదర్శకంగా జరిగే విధానంపై పర్యవేక్షణే లక్ష్యంగా కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు క్షేత్ర సహాయకులు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్) ద్వారా ఉదయం, మధ్యాహ్నం చిత్రాలు తీసి అప్‌లోడ్ చేసేవారు. ఈ విధానంలో కూలీలు రెండు పూటలా పని చేసినట్లు నమోదు చేసుకునే వారు. దీంతో సామాజిక ఆడిట్లు జరిగినప్పుడు హాజరులో లోపాలు ఉండటంతో క్షేత్ర సహాయకులకు జరిమానాలు విధించేవారు. కొత్త విధానంలో ఉదయం, సాయంత్రం హాజరు చిత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా కూలీలు పని ప్రదేశంలో ఉండాల్సి వస్తుంది.
నూతన విధానంలో ఇలా...
నూతన విధానంలో పనిచేసే ప్రదేశంలో ఉదయం తొమ్మిది గంటలకు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే చిత్రాలు తీయాలి. ఇలా తీసిన వాటినే రెండుసార్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. వీటిని పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించి ఎంపీడీఓలకు నివేదిక పంపుతారు. ఇవి సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది ఎంపీడీఓలు తనిఖీ చేస్తారు. యాప్ ద్వారా శ్రామికులు రెండు సార్లు మస్టర్లు వేసేలా వారు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
మస్టర్ల ఆధారంగానే ఉపాధి కూలీలకు వేతనాలు పని ప్రదేశంలో కూలీలు ఉండాల్సిందే