నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ పార్లమెంటు సభ్యులు మిథున్‌రెడ్డి అరెస్టు కక్షసాధింపులో భాగమేనని, ఆయనకు పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, పార్టీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అసలు స్కామే లేనిచోట స్కామ్ ఉన్నట్లుగా సృష్టించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దగ్గరగా ఉంటున్న వారందరిపై అక్రమ కేసులు నమోదుచేసి వేధిస్తున్నారన్నారు. అందులో భాగమే మిథున్‌రెడ్డి అరెస్టు అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులకు ఎస్‌వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల నుంచి వైరం ఉందన్నారు. అందులో భాగంగానే రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు చంద్రబాబు, మంత్రి లోకేష్ పూనుకున్నారన్నారు. మద్యం కుంభకోణం జరిగిందంటూ సిట్‌చే మిథున్‌రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్టుచేయటం చాలా బాధాకరమని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం విక్రయాలు తగ్గించామని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రభుత్వంలో బెల్టుషాపులు నిర్మూలించి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం విక్రయాలు చేయించారన్నారు. ప్రకటించిన సమయంలోనే మద్యం విక్రయాలు జరిగేలా చేశారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మద్యం ఏరులై పారిస్తుందన్నారు. ప్రతి ఊరికి ఆర్‌బీకే, సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్ జగన్‌మోహన్‌రెడ్డి పెడితే, ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి ఊరికి రెండు బెల్టుషాపులు ఏర్పాటు చేశారన్నారు. మిథున్‌రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ఆయన కడిగిన ముత్యంలా వస్తారని పేర్కొన్నారు. అరెస్టులకు భయపడే పార్టీ వైఎస్సార్‌సీపీ, నాయకులు కాదని అన్నారు. ఆయనకు అండగా పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక
అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి