
నేడు సీడీపీఓ కార్యాలయాల వద్ద ధర్నా జయప్రదం చేయండి
నరసరావుపేట:ఎఫ్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సోమ వారం రాష్ట్రవ్యాప్తంగా సీడీపీఓ కార్యాలయాల వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమంలో అంగన్‌వాడీలతోపాటు లబ్ధిదారులు పాల్గొని తమ నిరసన తెలపాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు కేపీ మెటిల్డాదేవి అధ్యక్షతన నిర్వహించారు. సుబ్బరావమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు తీరతాయని భావించిన అంగన్‌వాడీల పరిస్థితి పొయ్యి మీద నుంచి పెనం మీద పడిన చందంలా మారిందన్నారు. అంగన్‌వా డీ సెంటర్ల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పోషకాహారం పొందాలంటే ఎఫ్‌ఆర్‌ఎస్ తప్పనిసరైన నేపథ్యంలో సర్వర్లు మొరాయించటం, నెట్‌వర్క్, ఇతర సమస్యలతో అంగన్‌వాడీ సెంటర్లలో పోషకాహార నిల్వలు ఉన్నప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో అంగన్‌వాడీలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. 42 రోజుల అంగన్‌వాడీల సమ్మె సందర్భంగా ఇచ్చిన మినిట్స్ అమలు అవుతాయని ఆశించి భంగపడ్డారన్నారు. నాలుగేళ్ల కిందట ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదని వాటి స్థానంలో 5జీ ట్యాబ్‌లు పంపిణీ చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా ఆగస్టు నాటికి మారుస్తామని చెప్పి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయలేదన్నారు. అంగన్‌వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. యూనియన్ నాయకులు ఏఏల్ ప్రసన్న, బీవీ రమణ, సాయి, నిర్మల, కవిత, జ్యోతి, అహల్య, సుజాత, సావిత్రి, శ్రీదేవి పాల్గొన్నారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపు