పప్పన్నం తినలేం! | - | Sakshi
Sakshi News home page

పప్పన్నం తినలేం!

Jul 22 2025 7:52 AM | Updated on Jul 22 2025 8:06 AM

పప్పన

పప్పన్నం తినలేం!

రేషన్‌ సరుకుల్లో కందిపప్పు కట్‌

సత్తెనపల్లి: జిల్లాలో చౌక దుకాణాల్లో కందిపప్పు పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసే స్థోమత లేక పోవడంతో ఇక కందిపప్పుపై ఆశలు వదులుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. కందిపప్పు ధర అయితే ఎన్నడూ లేని విధంగా అమాంతం పెరిగిపోయింది. పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే కందిపప్పును వినియోగించుకుందామని తెల్ల రేషన్‌ కార్డుదారులు ఆలోచిస్తుంటే ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఏడాది జనవరిలో కొద్దిమందికి నామమాత్రంగా కందిపప్పు పంపిణీ చేశారు. ఫిబ్రవరిలో బియ్యంతో పాటు కొంతమందికి పంచదార పంపిణీ చేసి సరిపెట్టేశారు. మార్చిలో అయినా కందిపప్పు ఇస్తారని కార్డుదారులు ఆశగా ఎదురు చూడగా.. అప్పుడు నిరాశే ఎదురైంది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఒక్క నెల కూడా కందిపప్పు పంపిణీ చేయలేదు.

బియ్యంతో సరి

ప్రతి నెల రేషన్‌ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఉచిత బియ్యం మాత్రమే అందజేస్తున్నారు. ఎన్నికల్లో చౌక దుకాణాల ద్వారా అన్ని రకాల పప్పులు రాయితీ ధరలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. సరుకులు సక్రమంగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. నాలుగు నెలలుగా బియ్యం, అరకొరగా చక్కెర తప్ప మిగిలిన సరుకులు ఇవ్వడం లేదు. నాలుగు నెలలుగా కందిపప్పు ఇవ్వకపోవడంతో స్థానికులు చౌక దుకాణ దారులను నిలదీస్తున్నారు. కందిపప్పు సరఫరాలేదని, పంచదార ఇచ్చిన మేరకు అయిపోయిందని స్టాకు రావలసి ఉందని వారు చెబుతున్నారని కార్డుదారులు వాపోతున్నారు.

జిల్లాలో ఇలా...

జిల్లా వ్యాప్తంగా 1,289 చౌక దుకాణాల పరిధిలో 6,34,893 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో సభ్యులుగా ఉన్న 18,09,128 మందికి ప్రభుత్వం ప్రతి నెలా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తోంది. జిల్లాలో కార్డుదారులకు పంపిణీ చేయడానికి ప్రతినెల సుమారు 600 టన్నుల కందిపప్పు అవసరం. ప్రతి నెల 20వ తేదీ లోపు రేషన్‌ డీలర్లు డీడీలు తీసి అవసరమైన సరుకులు దిగమతి చేసుకుంటారు. అయితే డీలర్లు డీడీలు తీస్తున్నా పౌరసరఫరాల శాఖ మాత్రం కందిపప్పు అరకొరగా 100, 150 టన్నులు మాత్రమే ఇస్తుంది. దీంతో ప్రజలకు పూర్తిస్థాయిలో కందిపప్పు అందడం లేదు. ఈ నెల పూర్తిగా ఆపేశారు. కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా కందిపప్పు అందేది. ఽమార్కెట్‌లో ధర పెరిగినా ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీపై అందించేది.

వైఎస్సార్‌ సీపీ

ప్రభుత్వంలో రూ. 67కే..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జిల్లాలో 402 ఎండీయూ వాహనాల ద్వారా కందిపప్పు కిలో రూ.67కే పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకటి, రెండు నెలలు మాత్రమే ఎండీయూ వాహనాల ద్వారా అరకొరగా కందిపప్పు పంపిణీ చేసి చేతులెత్తేయడంతో పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.110 ఉంది. జిల్లాలో అధిక శాతం కూలి పనులు చేసుకునే వారే. ప్రభుత్వం పంపిణీ చేసే నిత్యావసరాలే వారికి ఆధారం. ఇందులో కందిపప్పు పూర్తిగా నిలిపివేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కందిపప్పు కూడా ఇవ్వలేని సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

జిల్లాలో చౌక దుకాణాల్లో కానరాని వైనం కేవలం బియ్యం, అరకొర పంచదారతోనే సరి బహిరంగ మార్కెట్‌లో మండుతున్న కందిపప్పు ధర నిరుపేదలను చిన్నచూపు చూస్తున్న కూటమి ప్రభుత్వం

పప్పన్నం తినలేం! 1
1/1

పప్పన్నం తినలేం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement