
బంగరు భవితకు నవోదయం
● ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు వరం ● జేఎన్‌వీలో ఆరో తరగతి ప్రవేశాలకు ఆహ్వానం ● 29 వరకు దరఖాస్తు దాఖలుకు గడువు ● డిసెంబర్ 13న ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు ● సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన
చిలకలూరిపేట టౌన్ / యడ్లపాడు: ప్రతిభవంతులైన పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు చక్కని అవకాశం కల్పిస్తోంది పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయం. చిలకలూరిపేట రూరల్ మండలంలోని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాది వేసే పాఠశాల విద్యలో జవహర్ నవోదయ విద్యాలయాలు మంచి విద్యా ప్రమాణాలను ఉచితంగా అందిస్తున్నాయి. పాఠశాలలో ఆరో తరగతిలో 80 సీట్లు ఉంటాయి. ప్రతిభావంతులైన విద్యార్థులను మాత్రమే వీటికి ఎంపిక చేస్తారు. ఇందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏటా ఒక్కో విద్యార్థికి అయ్యే ఖర్చును వెచ్చిస్తుంది. జూన్ 1న ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ నెల 29వ తేదీతో దరఖాస్తు దాఖలుకు గడువు ముగియనుంది.
సీబీఎస్‌ఈ సిలబస్...
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులు 6 నుంచి 12వ తరగతి వరకు ఎటువంటి ఖర్చు లేకుండా కో రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యను అభ్యసించవచ్చు.
సకల సౌకర్యాలు...
భోజనం, వసతి, దుస్తులు, పుస్తకాలు వంటివి అందజేస్తారు. బాలురు, బాలికల కోసం వేర్వేరు వసతి గృహాలున్నాయి. సువిశాల ప్రాంగణం, శాశ్వత తరగతి గదులు, డిజిటల్ పాఠాలకు ప్రత్యేక ఏర్పాట్లు, అధునాతన కంప్యూటర్ ల్యాబ్, రన్నింగ్ ట్రాక్, మైదానం ఉన్నాయి. ఉదయం వ్యాయామం, యోగా సాధన, చిత్రలేఖనం, సంగీతం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్ అండ్ గైడ్, పలు క్రీడల్లో శిక్షణ ఇస్తారు. పాఠ్యాంశాలతోపాటు విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కూడా ఎన్నో పుస్తకాలతో కూడిన గ్రంథాలయం, పూర్తిగా సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉంటుంది. ముఖ్యంగా జేఈఈ, నీట్‌కు కూడా విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తారు. జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేలా మైగ్రేషన్ (వలస) స్కీమ్ ద్వారా ఇక్కడ 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఇతర రాష్ట్రాల నవోదయ విద్యాలయాలకు పంపిస్తారు. దీంతో అక్కడి భాషలు, సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకునే చక్కని అవకాశం లభిస్తుంది.
అర్హులు వీరే...
ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాతిపదికన అడ్మిషన్లు జరుగుతాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంతాలలో చదివి ఉత్తీర్ణులైన వారికి ఈ కోటాలో అవకాశం కల్పిస్తారు. విద్యార్థి 2014 మే 1 – 2016 జూలై 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. తల్లిదండ్రులు ఉమ్మడి గుంటూరు జిల్లా నివాసితులై ఉండాలి. విద్యార్థి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చదువుకొని ఉండాలి.
పరీక్ష విధానం ఇలా...
విద్యార్థులు హెచ్‌టీటీపీఎస్//నవోదయ.జీవోవీ.ఇన్‌లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు నిర్వహిస్తారు. రెండు గంటల సమయం ఉంటుంది. తెలుగు, ఆంగ్లం, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ మాధ్యమంలో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షను అమృతలూరు, బాపట్ల, చిలకలూరిపేట, గుంటూరు, మంగళగిరి, నరసరావుపేట, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, తెనాలి, వినుకొండ, రేపల్లె ప్రాంతాల్లో నిర్వహిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
నవోదయలో అడ్మిషన్లు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరుగుతాయి. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే 750 అర్జీలు వచ్చాయి. పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. ఎలాంటి సిఫార్సులకు తావుండదు. తల్లిదండ్రులు, విద్యార్థులు అపోహలకు లోనవ్వకుండా అప్రమత్తతతో ఉండాలి. 6 నుంచి 12వ తరగతి వరకు ఎలాంటి ఖర్చు లేకుండా విద్యాభ్యాసం సాగించవచ్చు. దరఖాస్తులు గడువులోగా దాఖలు చేయాలి.
– నల్లూరి నరసింహారావు, ప్రిన్సిపల్, పీఎంశ్రీ జేఎన్‌వీ, మద్దిరాల

బంగరు భవితకు నవోదయం