
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు
సత్తెనపల్లి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుంటూరులోని ఆయన నివాసంలో ఆదివారం సత్తెనపల్లి రూరల్ ఏఎస్‌ఐ శ్రీనివాసరావు (ర్యాంబో) నోటీసులు అందించారు. గత నెల 18న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జన సమీకరణ చేశారనే నెపంతో నమోదు చేసిన అక్రమ కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు అందించారు. ఇప్పటికే దీనిపై పట్టణ పోలీస్టేషన్‌లో నమోదైన అక్రమ కేసులో విచారణకు ఈనెల 11న ఆయన హాజరయ్యారు. మరో అక్రమ కేసు సత్తెనపల్లి రూరల్ పోలీస్టేషన్‌లో నమోదు చేయడంతో సోమవారం ఆయన విచారణకు హాజరు కానున్నారు.
అమ్మవారి ఆలయానికి
రూ. 4 లక్షల విరాళం
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి పట్టణానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు వజ్రాల క్రాంతికిరణ్, వెంకాయమ్మ దంపతులు, వారి కుమార్తెలు ఇషికారెడ్డి, మహిరా కిరణ్‌రెడ్డిలు రూ. 4 లక్షలు విరాళంగా అందజేశారు. ఆలయ కార్యాలయంలో విరాళం చెక్‌ను అందజేశారు. ఆలయ నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళాన్ని గతంలో ప్రకటించడం జరిగిందని, ఇందులో భాగంగా రూ.4లక్షలు అందజేసినట్టు దాతలు వివరించారు.
566.70 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 566.70 అడుగులకు చేరింది. ఇది 248.2946 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 67,556 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
అమ్మ వారికి బోనాలు
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలోని శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా అమ్మవారు పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మ వారికి 1000 మంది మహిళలు బోనాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఈఓ కె.సునీల్‌కుమార్ పర్యవేక్షించారు.
రవిచంద్రకుమార్‌కు అవార్డు
గుంటూరు మెడికల్: ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో 40 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న తెలుగునాడు కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, రెడ్ క్రాస్ లైఫ్‌మెంబర్ ఎం.రవిచంద్రకుమార్‌కు నంది అవార్డు లభించింది. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి విజయవాడలోని రితికా ఫౌండేషన్ ఆదివారం అవార్డు ఇచ్చి సత్కరించింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిత్యాచారికి రవిచంద్ర కతజ్ఞతలు తెలిపారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు