
కేంద్ర మంత్రి కాన్వాయ్ అడ్డగింత
ప్రత్తిపాడు: కేంద్ర మంత్రి పెమ్మసానికి నీటి ఎద్దడి సెగ తగిలింది. తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు ఇప్పించండంటూ గ్రామస్తులు, మహిళలు రోడ్డెక్కి కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటన ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం తిమ్మాపురంలో గిడ్డంగి ప్రారంభోత్సవానికి గురువారం సాయంత్రం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. మార్గ మధ్యలో కోయవారిపాలెంలో గుంటూరు–పర్చూరు పాతమద్రాసు రోడ్డుపై కాన్వాయ్‌ను స్థానిక మహిళలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, చెరువు కూడా అడుగంటిందని, కొద్ది రోజులుగా సురక్షిత మంచి నీటికి దిక్కులేకుండా పోయిందంటూ గ్రామస్తులు సమస్యను ఏకరువు పెట్టారు. అడుగంటిన రక్షిత మంచినీటి చెరువు నీటిని తీసుకువచ్చి మంత్రికి చూపించారు. అంతేకాకుండా చెరువులు నింపుకొనేందుకు కాలువల్లో నీళ్లు రావడం లేదని తెలిపారు. ఒక వేళ నీళ్లు వదిలినా కాలువలు పూడిపోయి ఉన్నాయని చెప్పారు. నీళ్లు చెరువు వరకు వచ్చే పరిస్థితి కూడా లేదని తెలిపారు. ఇలా అయితే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోనికి ఒక్కసారి వచ్చి అడుగంటిన మా చెరువు దుస్థితిని చూడాలని మహిళలు, స్థానికులు పట్టుబట్టారు. కేంద్ర మంత్రి పెమ్మసాని వెంటనే గ్రామంలోనికి ఐదు పెద్ద వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయిస్తానని హామీ ఇచ్చారు. కాలువ మరమ్మతులకు తన నిధుల నుండి రూ.రెండు లక్షలు కేటాయిస్తానని చెప్పారు. రేపటి నుంచే పనులు ప్రారంభించుకోవాలని, కాలువల ద్వారా నీళ్లు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పారని స్థానికులు వివరించారు. ఇంతలో స్థానిక పెద్దలు, పోలీసులు రంగప్రవేశం చేసి మహిళలకు నచ్చజెప్పడంతో కాన్వాయ్ ముందుకు సాగింది.
కొద్దిరోజులుగా నీరు రాక ఇబ్బందులు
పడుతున్నామంటూ ఆవేదన
గ్రామంలోనికి వచ్చి చెరువు
చూస్తే సమస్య అర్థమవుతుందని
మహిళల వినతి
వెంటనే సమస్య పరిష్కరిస్తానని హామీ
ఇచ్చి ముందుకు సాగిన మంత్రి

కేంద్ర మంత్రి కాన్వాయ్ అడ్డగింత