
అదే.. ఆ తల్లి ప్రత్యేకత
● మానసిక పరిణితి లేని ఆడపిల్ల నీహారిక ● కంటిపాపలా చూసుకున్న తల్లిదండ్రులు ● ఆనందాన్నీ, అవసరాలను వదులుకున్నారు ● బిడ్డ కోసం టీచరుగా మారిందా తల్లి ● ఇష్టమైన సైక్లింగ్‌లోనూ శిక్షణనిచ్చింది ● స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గేలా చూశారు ● ఇప్పుడా బిడ్డలాంటి మరికొందరికోసం ఏకంగా అలాంటి పాఠశాలనే నడుపుతోందా తల్లి
తెనాలి: ‘‘అది 2019 సంవత్సరం మార్చి నెల. 14–21 తేదీల్లో దుబాయ్‌లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్. 25 గేమ్స్‌లో 170 పైగా దేశాలకు చెందిన ఏడు వేల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 280 మంది వివిధ పోటీల్లో తలపడ్డారు. ఇందులో సైక్లింగ్‌లో 16 మంది పాల్గొంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ యువతి ఆ పోటీలో పాల్గొంది. ఆ పోటీల్లో యువతి 500 మీటర్లు, కిలోమీటరు పోటీలు రెండింటిలోనూ ద్వితీయ స్థానం సాధించి రజత పతకాలను కై వసం చేసుకుంది. రెండు కి.మీ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచింది. ఆ యువతే 2018లో రాంచీలో నిర్వహించిన జాతీయ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో కిలోమీటరు సైక్లింగ్‌లో బంగారు పతకం, రెండు కి.మీ విభాగంలో రజత పతకం గెలిచి, స్పెషల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.’’ మానసిక పరిపక్వత లేదని సమాజం ఈసడించింది. తనపై డబ్బు ఖర్చుచేసినా, శ్రమ వెచ్చించినా ఎలాంటి ప్రయోజనం లేదు... తిండి, బట్ట ఇస్తే సరిపోతుందని తలిదండ్రులకు జాగ్రత్తలు చెప్పింది. అయితే సమాజం మాటవిని ఆ పాపను తల్లిదండ్రులు వదిలేయలేదు. తనకోసం తమ ఆనందాల్నీ, అవసరాలనూ వదులుకున్నారు. మానసిక వికలాంగురాలైన తమ కూతురు నీహారికను తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలలో చదివిస్తూ తనకెంతో ఇష్టమైన సైక్లింగ్‌లో శిక్షణనిస్తూ వచ్చిందా తల్లి భార్గవి. తద్ఫలితమే.. నీహారిక సాధించిన విజయాలు.
భార్గవి సొంతూరు చినపరిమి
భార్గవి సొంతూరు తెనాలి సమీపంలోని చినపరిమి. భర్త ఆర్మీ ఉద్యోగి ముక్కామల శివరామకృష్ణ. 2001లో తొలి కాన్పులో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఏడాదిన్నర వచ్చినా నడక రాకపోవటంతో అనుమానం వేసింది. ఉద్యోగరీత్యా అప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఉన్నారు. ‘ఒకసారి న్యూమోనియాకు ఇచ్చిన మందు ఓవర్‌డోస్ అయి, నాలుగురోజులు పాప కోమాలో ఉంది... తెలివొచ్చేసరికి మాటలు బాగా తగ్గిపోయాయి..చెప్పిందీ అర్థం చేసుకోవటం తగ్గింది. డ్రమ్స్ మోగినా, బాణసంచా పేలుళ్లు విన్నా, భయంతో వణికేది...పెరిగేకొద్దీ ఆ భయం ఎక్కువైంది’ అని భార్గవి గుర్తుచేసుకున్నారు. అయిదో ఏడు వచ్చేసరికి ఆగ్రాకు వెళ్లారు. అక్కడి డాక్టర్లు ‘ఇంటలెక్చువల్ డిసేబిలిటీ’ అన్నారు. ‘పిల్లలతో విపరీతంగా ప్రవర్తించేది అప్పుడే...డ్రమ్స్, బాణసంచా మోతకు భయపడిపోయేది. ఎవరినీ దగ్గరకు రానిచ్చేదికాదు...తనొక్కతే ఏదొక వస్తువుతో ఆడుకుంటూ ఉండేది...ఆ క్రమంలో సైకిల్ తనను బాగా ఆకర్షించింది...చిన్న సైకిల్ నడిపేది. పాడైపోతే కొత్తది కొనేదాకా ఊరుకునేది కాదు...ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాను’ అన్నారు భార్గవి. అప్పటికి తనకు మరో బాబు కలిగాడు.
కుమార్తె కోసం త్యాగాలు..
పాప ఆరోగ్యం కారణంగా హైదరాబాద్‌కు బదిలీ చేయించుకున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో చేర్పించారు. కొడుక్కి హోం వర్క్ చేయించేటపుడు, నీహారికను దగ్గరుంచారు. స్పీచ్ థెరపీనీ ఇప్పించారు. 2013లో విజయవాడకు వచ్చేశారు. 2013 నవంబరులో ఇలాంటి పిల్లల కోసం ఓపెన్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతాయని తెలుసుకున్నారు. 2014లో పార్టిసిపేట్ చేసేలా చూశారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు పాపను నిద్రలేపటం, హైవేపై 10 కి.మీ ప్రాక్టీస్ చేయించి, ఇంటికి తీసుకొచ్చేవారు. తర్వాత ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’కు తీసుకెళ్తారు. నీహారిక కోసం తనుకూడా అదే స్కూలులో ఉద్యోగం చేశారు భార్గవి. శివరామకృష్ణ కూడా వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
విభిన్న ప్రతిభావంతులకు తల్లిలా..
తన బిడ్డ నీహారిక లాంటి మరికొందరి కోసం ఇప్పుడా తల్లి ఏకంగా స్కూలునే నడుపుతోంది. 2020లో ప్రజ్ఞ వెల్ఫేర్ సొసైటీని రిజిస్టరు చేశారు. 2022 నుంచి ఆ సొసైటీ తరఫున సాయి అంకుర్ స్పెషల్ స్కూల్‌ను ఆరంభించారు. 2019లో స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకాల సాధనతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్‌మనీతో మొదలుపెట్టిన స్కూలుకు ఇప్పుడు సొంత డబ్బులు పడుతున్నాయి. పిల్లల తల్లిదండ్రుల మద్దతు తోడవుతోంది. పిల్లలు తమ పనులు తాము చేసుకోవటం, అవసరాలను తీర్చుకోవటం, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా శిక్షణనివ్వటం తమ ఆశయమని చెప్పారు భార్గవి. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులోని ‘సాయి అంకుర్ స్పెషల్ స్కూల్’ ఇప్పుడు భార్గవి ప్రపంచం. 24 ఏళ్ల కుమార్తె నీహారికతో సహా పదిహేనుమంది విభిన్న ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అక్కడ పిల్లలకు రకరకాల యాక్టివిటీస్, ఆటలతో బోధన ఉంటుంది. రోజువారీ స్కూలుకు వెళుతూ రెమిడియల్ క్లాసుకు వచ్చేవారూ ఉన్నారని భార్గవి చెప్పారు. తనతోపాటు అక్కడ ముగ్గురు టీచర్లు, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. పాప కోసం ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’ టీచరుగా పనిచేసిన భార్గవి, ఇప్పుడు ఏకంగా అలాంటి స్కూలునే నడుపుతూ ఎందరికో తల్లిలా మారింది.