
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావుపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఏస్)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 150 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ ఏకా మురళి, ఆర్డీఓ మధులత పాల్గొన్నారు.
కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించండి
ప్రతి రోజూ 24గంటలూ సేవలు అందజేసే కేబుల్ ఆపరేటర్లకు గత ఏడు నెలలుగా ఏపీ పైబర్ నెట్ సంస్థ ద్వారా ప్రతిరోజూ సిగ్నల్ అంతరాయం కలుగుతుంది. దీనికి అనుభవజ్ఞులైన సాంకేతిక సిబ్బందితో పరిష్కారం చూపించాలి. సెటాప్ బాక్స్‌ల రెంటల్ చార్జీల గడువు ముగిసినా తమ నుంచి రూ.59 వసూలు చేయటం విడనాడాలి. పెట్టుబడి రూపంలో ఆర్థిక సహాయం చేసి సెటాప్‌బాక్స్‌లు, ఓఎల్‌టీలు, బ్యాటరీలు అందుబాటులో ఉంచాలి. కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి.
–బీవీవీ భాస్కరరెడ్డి, వెంకటరావు, అధ్యక్ష, కార్యదర్శులు, కేబుల్ ఆపరేటర్లు ఏపీ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు లక్ష షరతులు విధిస్తున్నారు
ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు సిబిల్ స్కోర్ బాగుండాలని, ష్యూరిటీ చూపించాలని, గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల బాకీలు ఉండకూడదని, డ్వాక్రాలోను సైతం పెండింగ్ ఉండరాదనే షరతులతో లబ్ధిదారులను వేధిస్తున్నారు. దీని వలన రుణాలు అందక ఎస్సీ వర్గీయులు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకర్లతో వెంటనే సమావేశం ఏర్పాటుచేసి లబ్ధిదారులకు సులభంగా రుణాలు మంజూరుచేసేలా ఆదేశాలు ఇవ్వండి.
– చింతిరాల మీరయ్యమాదిగ,
మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి
ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టండి
జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు యాజమాన్యాలు అధిక ఫీజులతో పాటు పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి.
–నల్లపాటి రామారావు, జి.రామకృష్ణ, వి.కోటానాయక్, ప్రజాసంఘాల నాయకులు

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ