
జిల్లా ప్రగతి పథంలో నడవాలి
నరసరావుపేట: పల్నాడు జిల్లా 15 శాతం వృద్ధిరేటుతో ప్రగతి సాధించేలా అధికారులు పనిచేయాలని రాష్ట్ర 20 సూత్రాల పథకం చైర్ పర్సన్ లంకా దినకర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, నరసరావుపేట, మాచర్ల ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర శిల్పారామం సొసైటీ చైర్‌పర్సన్ మంజులారెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించారు. పర్యాటక రంగం అభివృద్ధికి జిల్లాలో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం విధానంలో 50 వేల ఎకరాలున్న విస్తీర్ణం 1.25 లక్షల ఎకరాలకు పెంచాలని ఆదేశించారు. ఒంగోలు జాతి గిత్తల వృద్ధికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవసరాలకు తగినంత పాల ఉత్పత్తి పెంచాలని తెలిపారు. శ్రామికులకు రోజుకు రూ.300కి మించి వేతనాలు అందేలా ఉపాధి కల్పన, పశువులకు నీటి తొట్ల ఏర్పాటు, ఫారం పాండ్ల నిర్మాణం, కాల్వల మరమ్మతులు, అమృత్ సరోవర్ పనులలో లక్ష్యాలు చేరుకోవాలన్నారు. నీరు ఇవ్వకుండానే జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయిలు ఇంటింటికీ ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. పేదలకు మంజూరు చేసిన గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారని పేర్కొన్నారు. పనులలో పురోగతి సాధించలేని గుత్తేదారులను తొలగించాలని ఆదేశించారు. గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మించి సైడ్ కాల్వలు విస్మరించడంపై నిలదీశారు. సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గంలో పదివేల సాధారణ కనెక్షన్లు లక్ష్యంతో విద్యుత్ శాఖ అధికారులు పనిచేయాలన్నారు. సర్వేలలో వివరాలు పక్కాగా సేకరించడం ద్వారా పథకాలకు అర్హులను గుర్తించొచ్చన్నారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఈ ఏడాది 28 కేసులు నమోదయ్యాయన్నారు. నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగారావు, డీఆర్వో ఏకా మురళి తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక రంగంపై దృష్టి సారించండి 20 సూత్రాల పథకం చైర్ పర్సన్ లంకా దినకర్