పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణం మారుతీనగర్‌లో సోమవారం జరిగిన హత్య కేసు విచారణ నిమిత్తం పల్నాడు జిల్లా కె.శ్రీనివాసరావు సోమవారం హాజరయ్యారు. తొలుత ఆదిలక్ష్మి హత్యకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని పడేసిన క్వారీని గుంతను పరిశీలించారు. అనంతరం పట్టణ పోలీసు స్టేషన్‌కు చేరుకుని, హత్యకు సంబంధించి పూర్తి వివరాలు సీఐ శ్రీరామ్ వెంకట్రావును అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.
కొత్త కవులను ప్రోత్సహిద్దాం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బ్రాడిపేటలోని కథా రచయిత్రి తాటికోల పద్మావతి నివాసంలో గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కవులందరూ కలిసి ‘కవిత్వంతో కాసేపు’ నిర్వహించారు. ఈనెల 21 న అంతర్జాతీయ కవితా దినోత్సవం, 30న ఉగాది పండుగ సందర్భంగా కవిత్వంపై చర్చించారు. ఔత్సాహిక కవులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సంఘం పని చేద్దామని సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం.సుభాని తెలిపారు. కవులు తాము రాసిన కవితతోపాటు సమకాలీన కవులు రాసిన, తమకు నచ్చిన మరో కవిత వినిపించి జయప్రదం చేశారని కోశాధికారి నానా చెప్పారు. సంఘానికి కొత్తగా పరిచయమైన కవులు మెట్టు శ్రీనివాసరెడ్డి, సురేష్, కడంశెట్టి సతీష్‌కుమార్ మాట్లాడారు. ఇది కవి సంగమం అని, సత్సంగమని, అందరూ మర్యాద పూర్వకంగా కలవడం సంతోషంతోపాటు ప్రోత్సాహాన్నిచ్చిందని పేర్కొన్నారు. రచయిత్రి తాటికోల పద్మావతి ఆతిథ్యం, ఆప్యాయతలను కవులు కొనియాడారు. సంఘం ఉపాధ్యక్షులు బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి, సభ్యులు ఈవూరి వెంకట రెడ్డి, కొణతం నాగేశ్వరరావు, శ్రీవశిష్ట సోమేపల్లి పాల్గొన్నారు.