
పల్నాడు: కొండవీడు భావితరాలకు అందించాల్సిన చారిత్రక ఖజానా. ప్రకృతి రమణీయతకు ఆలవాలం.. అబ్బురపరిచే విశేషాల సమాహారం.. కళ్లు చెదిరే సుమనోహర దృశ్యాల సుందర నగం.. పచ్చదనంతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే అద్భుత విహారకేంద్రం.. సందర్శకులతో నిత్యం శోభిల్లుతున్న అందాల బృందా‘వనం’.. అందుకే కొండవీటి కోటను మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కొండవీడు–నగరవనం కార్యక్రమం ద్వారా చారిత్రక కట్టడాల ఆధునికీకరణకూ శ్రీకారం చుట్టింది.
దీనికోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రత్యేక శ్రద్ధతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించి అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఘాట్ రోడ్డు మొదలు, స్వాగత ద్వారం, చిల్డ్రన్స్ పార్కు, చెరువుల అభివృద్ధితోపాటు తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, సోలార్ దీపాలు వంటి వసతులు కల్పించారు. పర్యాటక సొబగులు అద్దారు.
చారిత్రక ప్రదేశాలకు మార్గం సుగమం
కొండపైన ఎత్తైన ప్రదేశాల నుంచి అందాలను తిలకించేందుకు వ్యూ పాయింట్లుగా ఉన్న తారాబురుజు, జెట్టిబురుజులకు ఇప్పటివరకు వెళ్లే మార్గం లేదు. పుట్టాలమ్మ చెరువు వద్ద 20 అడుగుల ఎత్తులో ఉన్న మండపాన్ని చేరుకోవాలన్నా కష్టమే. దీంతో అధికారులు ఈ మూడు చోట్ల జంగిల్ క్లియరెన్స్ చేసి సందర్శకులు వాటిని చేరుకునేలా మార్గం సుగమం చేశారు. తాజాగా శతాబ్దాల నాటి పురాతన బావి, నాడు ప్రసిద్ధి చెందిన రెండు ప్రత్యేక ప్రదేశాలను సందర్శకులకు అందుబాటులోకి తెచ్చేందుకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే మేళ్లదిబ్బ, జడ్డిగాల బావి, బ్రిటిష్ కాలంనాటి గెస్ట్‌హౌస్ వెనుక ఉన్న స్థలాల్లో మొత్తం మూడు పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.