
కళల పండుగకు వేళాయె !
● నేటి నుంచి 40వ జాతీయ సంగీత, నాట్య, కళారూపాల పోటీలు ● కళా నిలయం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహణ ● వేదికగా వెంకటేశ్వరస్వామి కల్యాణ మండపం
చిలకలూరిపేట: కళా రంగంలో చిలకలూరిపేట కీర్తిని దేశ నలుమూలలా వ్యాప్తి చేసిన ఘనత స్థానిక కళా నిలయం సంస్థకు చెందుతుంది. కళలను ప్రోత్సహించండి – కళాకారులను ఆశీర్వదించండి అంటూ సంస్థను కళా నిలయం అధ్యక్షుడు ప్రగడ రాజమోహనరావు ప్రారంభించారు. కళాభిమానులైన దాతల సహకారంతో ఏటా సంగీత, నాట్య, కళారూపాల పోటీలు నిర్వహిస్తున్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా కళలను బతికిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తున్న ఘనత రాజమోహనరావుకే దక్కుతుంది. కళలంటే ఆయనకు ప్రాణం..కళాకారులంటే అభిమానం. అందుకే 1984లో కళా నిలయాన్ని స్థాపించి కళామ తల్లికి సేవలందిస్తున్నారు. తీవ్ర అనారోగ్య పరిస్థితులు వెంటాడుతున్నా, ఆర్ధిక పరిస్థితులు సహకరించకున్నా, దాతలే హితులై అందిస్తున్న సహకారంతో నృత్య, సంగీత, కళా రూపాల పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పోటీలు శనివారం నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు నిర్విరామంగా పగలు, రాత్రి మూడు రోజులపాటు కొనసాగుతాయి.
సంప్రదాయ కళలకు ఊతం
పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపం ఈ పోటీలకు వేదిక కానుంది. పాశ్చాత్య నృత్య, సంగీత హోరులో ఆదరణ కోల్పోతున్న భారతీయ సంప్రదాయ కళలకు ఊతమిచ్చేందుకు ప్రస్తుత తరుణంలో కళా నిలయం వేదికగా నిలుస్తోంది. ఉత్సవంలో పలు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు పాల్గొంటారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయలను తమ అద్భుత కళారూపాల ద్వారా భావితరాలకు అందించే ప్రయత్నం చేయడం విశేషం. భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు, నృత్య నాటికల పోటీలతో పాటు జానపద, సినీ గేయాల పోటీలను కళానిలయం వేదికగా నిర్వహించడం విశేషం.
కళాకారులతో
కళకళలాడనున్న వేదిక
కళా నిలయం 40వ జాతీయ నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళారూపాల పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది పైగా కళాకారులు తరలిరానున్నారు. సూర్య, చంద్ర విభాగాల పేరిట రెండు గ్రూపులుగా పోటీలను నిర్వహిస్తారు. కూచిపూడి, భరతనాట్యంతో పాటు శాసీ్త్రయ బృంద నాట్యాలు, సినీ మధుర గీతాలు, యుగళ గీతాలు, నృత్య నాటికలు, శాసీ్త్రయం కాని బృంద నాట్యాలు, నృత్య నాటికల పోటీలు ఉంటాయి.

కళల పండుగకు వేళాయె !