
నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదానంకు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామ వాస్తవ్యుడు పానుగంటి జయ నటరాజ్‌కుమార్, లక్ష్మీదివ్య దంపతుల కుమారుడు షత్విక్ జయదేవ్ పేరున రూ.1,00,001 విరాళంగా శుక్రవారం ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందించారు. దాతలు తొలుత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
నేడు ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక పీజీఆర్‌ఎస్
నరసరావుపేట: ప్రతి నెలా నాలుగో శనివారం ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్సీలు, ఎస్టీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఆర్టీసీ స్థలాల అద్దె వ్యవహారంపై సమావేశం
నరసరావుపేట: సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ళలో ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాలను 15 ఏళ్లపాటు చట్టపరమైన వ్యాపారం చేసుకునేందుకు అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో శుక్రవారం ఆర్టీసీ డిపోలోని ప్రజా జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నెల్లూరు జోనల్ కార్యాలయం ద్వారా టెండర్లు పిలవనున్నారని పీటీడీ జిల్లా అధికారి ఎం.మధు పేర్కొన్నారు. ఇవ్వబోయే స్థలాలను గురించి పారిశ్రామిక వేత్తలతో చర్చించారు.
వైభవంగా ఆంజనేయుని రథోత్సవం
వేమూరు: మండలంలోని జంపని గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమజ్జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తుల హనుమ నామస్మరణ, మేళతాళాల మధ్య వేడుక సాగింది. కోలాటం, భజనల నడుము రథోత్సవం జరిగింది. భక్తులు షేక్ అబ్దుల్ కలాం ఆజాద్ దంపతులు వార్షిక పూజాకర్తలుగా వ్యవహరించారు. పెరుమాళ్లు వెంకట సుబ్బయ్య, పెరుమాళ్ళ రామయ్య నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో గొంది శివరామ కృష్ణ ప్రసాద్, మన్నే శివ వెంకటేశ్వరరావులు ప్రసాద పంపిణీ చేశారు. ఆంజనేయ భక్త బృందం, సీతారామాంజనేయ భజన సమాజం, ఆంజనేయ యువజన భక్త సమాజం, వీరాంజనేయ కోలాట భజన సమాజం సభ్యులు పాల్గొన్నారు.
నేడు సరస్వతి
పుష్కరాలకు ప్రత్యేక బస్సు
పట్నంబజారు: సరస్వతి పుష్కరాలు పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ గుంటూరు–2 డిపో నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఎం ఎం.రవికాంత్ శనివారం తెలిపారు. 12 సంవత్సరాలకొకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఈ నెల 24న గుంటూరు–2 డిపో నుంచి బస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యాత్ర మొత్తం మూడు రోజులు ఉంటుందని, 24వ తేదీ రాత్రి 10 గంటలకు బయల్దేరి, రెండో రోజు కాళేశ్వరం చేరుతుందన్నారు. అక్కడ పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత రామప్ప దేవాలయం, వరంగల్ భద్రకాళి దేవాలయం, వెయ్యి స్థంభాల గుడి దర్శించడం జరుగుతుందన్నారు. మూడో రోజున కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించి, అనంతరం వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరి స్వామి వారిని దర్శించుకుని గుంటూరు తిరుగు ప్రయాణం అవుతుందన్నారు. ఈ సర్వీసుకు సంబంధించి ఆన్‌లైన్‌లో 96163 నంబరు ద్వారా రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక్కొక్క ప్రయాణికుడికి రూ.2,420 టికెటు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఇతర ఖర్చులు సొంతంగా చూసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 73828 97459, 73828 96403 ఫోను నంబర్లలో సంప్రదించాలని కోరారు.

నిత్యాన్నదానానికి విరాళం