
సర్వర్ పని చేయదు.. కూటమి కనికరించదు
కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఊరిస్తూ వచ్చిన కొత్త రేషన్‌కార్డుల మంజూరు, కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చినా ప్రజలకు చిక్కులు తప్పడం లేదు. దరఖాస్తు ప్రక్రియ తీవ్ర జాప్యంతో ఇబ్బందులెదుర్కొంటున్నారు. పౌరసరఫరాల శాఖ సర్వర్ మొరాయింపుతో గంటల కొద్దీ సచివాలయాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి.
కొత్త జంటలకు చిక్కులే...
సమస్యలివే...
● రేషన్‌కార్డులో తప్పుగా నమోదైన కుటుంబ సభ్యుల సంబంధాలను సరి చేసుకోవాలన్నా, కార్డులోంచి తొలగించాలన్నా ఆన్‌లైన్ ఆప్షన్ ఇవ్వలేదు.
● మార్పులు చేర్పులకు 15 సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రమే అవకాశమిచ్చారు. 15 ఏళ్లకు మించిన పిల్లలను ఏదైనా కారణాలతో ఇప్పటివరకు లేనివారిని చేర్చేందుకు అవకాశం లేకుండాపోయింది.
● వివాహం చేసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారిని కార్డులోంచి తొలగించేందుకు ఆప్షన్ ఇవ్వలేదు. కేవలం చనిపోయిన, ఇక్కడే పెళ్లి చేసుకొని వేరే కార్డులోకి బదిలీ చేస్తేమాత్రమే పేర్లు తొలగించే అవకాశముంది.
● కార్డులో ఆధార్ మ్యాపింగ్ తప్పుగా అయితే దాన్ని సరిచేసుకునేందుకు ఆప్షన్ లేదు. సింగిల్ రేషన్ కార్డు దరఖాస్తుకు కేవలం 40–50 ఏళ్ల వయసున్నవారికే అవకాశం ఇచ్చారు. 50 ఏళ్లపైబడిన వారికి కుదరడం లేదు.
సాక్షి, నరసరావుపేట : రేషన్ దరఖాస్తు ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలంటే కనీసం రెండు మూడు గంటల పడుతోంది. తరువాత బయోమెట్రిక్ చేయించాలంటే సర్వర్ కోసం వేచి ఉండాల్సిందే. సాయంత్రం 5 గంటల నుంచి ఏడు గంటల మధ్య సర్వర్ పని చేస్తోందని ఆ సమయంలో రావాలని సచివాలయ డిజిటల్ అసిస్టెంట్‌లు చెబుతున్నారు. దీంతో చేసేదేమి లేక ఆ సమయంలో పడిగాపులు కాచి వేలిముద్రలు వేస్తున్నారు. ఆ రెండు గంటల సమయంలో కూడా మహా అయితే నాలుగైదు దరఖాస్తులే పూర్తి అవుతున్నాయి. రోజు పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండగా పదిలోపే దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతోంది. దీంతో ఒక్కో దరఖాస్తుదారుడు రెండు మూడు రోజులు పనిమానుకొని సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. చిన్నారులను కార్డులో చేర్చడానికి వెళ్లిన తల్లుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. చంటి బిడ్డలతో గంటల కొద్దీ వేచి ఉండటం ఇబ్బందిగా మారుతోంది.
హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌తో చిక్కులు...
హౌస్ హోల్డ్ డేటా ఎనేబుల్ చేయకపోవడంతో సమస్యలు అధికంగా వస్తున్నాయి. హౌస్‌హోల్డ్ సర్వేలో వివరాలను తొలగించడం, సవరించడం కుదరకపోవడంతో లబ్ధిదారులకు విపరీతమైన సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వేలో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తేనే ఈ సమస్య కొలిక్కివచ్చే అవకాశముంది. గతంలో జారీ చేసిన ఒకే తెల్లరేషన్ కార్డుపై రెండు రైస్‌కార్డులు ఉంటున్నాయి. ఈ రెండు కార్డులలోని సభ్యులంతా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటున్నారు. ఇప్పుడు ఆ కార్డులలో దేనిలోనైనా ఒక సభ్యుడిని చేర్చాలన్నా, తీసేయాలన్నా సాంకేతికంగా ఇబ్బంది అవుతోంది. సభ్యులంతా సచివాలయానికి వచ్చి వేలిముద్రలు వేయాలని సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఎక్కడెక్కడో ఉన్న రెండు కార్డులలోని సభ్యులంతా సచివాలయానికి పరుగులు తీయాల్సి వస్తోంది. పోనీ వెంటనే పని జరిగిపోతుందా అంటే అదిలేదు. సర్వర్ మొరాంపుతో ఎప్పుడు ఓపెన్ అయితే అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. ఇది ఒక్కోసారి రెండు మూడు రోజులు కూడా పడుతోంది. దీంతో వారంతా ఉద్యోగాలు, పనులకు సెలవుపెట్టి వేచి చూడాల్సి వస్తోంది.
కొత్తగా పెళ్లి అయిన జంటలో ఒకర్ని కార్డులో చేర్చే సమయంలో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. వివాహ ధ్రువపత్రాలు, పెళ్లికార్డులు, పెళ్లి ఫొటోలు అప్‌లోడ్ చేస్తేనే కొత్త సభ్యుడి చేర్పు దరఖాస్తు పూర్తి అవుతుందని లేదంటే అప్లోడ్ కావడం లేదని ఈ నెల 7వ తేదీ నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని చెబుతున్నప్పటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయకపోవడంతో సాంకేతికంగా ఇబ్బంది అవుతోంది. గత రెండు వారాలుగా రిజిస్ట్రేషన్ లేని జంటలు రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
రేషన్ కార్డు దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్న సర్వర్ దరఖాస్తుకు రెండు, మూడు రోజులు పని మానుకోవాల్సిందే ఒక సభ్యుడిని చేర్చాలని వెళితే కుటుంబం మొత్తం రావాల్సిందే అంటున్న సచివాలయ సిబ్బంది సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య బయోమెట్రిక్‌కి అవకాశం చంటి బిడ్డలతో తల్లులు వేచి చూడాల్సిన దుస్థితి వాట్సాప్‌లో దరఖాస్తులకు అవకాశం అంటూ ప్రచారం వాట్సాప్ గవర్నెన్స్‌లో కనిపించని ఆప్షన్
ప్రభుత్వ సేవలన్నీ సెల్‌ఫోన్‌లో పొందవచ్చని గొప్పలు చెప్పి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవలు రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉపయోగపడటంలేదు. మే 15వ తేదీ నుంచి కార్డుదారులు 98823 00009 నెంబర్‌తో పనిచేసే వాట్సప్ గవర్నెన్స్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటనలు చేసింది. తీరా చూస్తే ఇప్పటికి వాట్సాప్ గవర్నెన్స్‌లో రేషన్ కార్డుల దరఖాస్తు, సభ్యుల చేర్పు వంటి ఆప్షన్లు కనిపించడం లేదు.

సర్వర్ పని చేయదు.. కూటమి కనికరించదు