
సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీలో కొత్త రాజకీయం మొదలైందంటూ.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. గతంలో అక్కడక్కడ గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేదని.. కానీ కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడిని అణగదొక్కాలన్న ఆలోచనతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకెళ్తుందని దుయ్యబట్టారు.
‘‘ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుంది. కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే భ్రష్టు పట్టిపోయింది. వైఎస్సార్‌సీపీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు.. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. కనీసం ఈ కేసులో ఎటువంటి ఆధారాలు కూడా లేవు’’ అని మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘కొంతమంది పోలీసులు పచ్చ చొక్కా వేసుకోకుండానే టీడీపీ కార్యకర్తల పని చేస్తున్నారు. చంద్రబాబు అనుకూల మీడియా వైఎస్ జగన్‌ని కూడా అరెస్టు చేస్తారంటూ ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో ఉంచింది. 40 శాతం ఓట్ షేర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ జగన్‌ను అక్రమ కేసుల్లో జైలుకు పంపడంతో రెండు శాతానికి పడిపోయింది. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయింది. రేపు కూటమి పరిస్థితి కూడా అంతే. ఇవాళ మాకు పాఠాలు నేర్పుతున్నారు.. రేపు అవి వారికి గుణపాఠాలవుతాయి’’ అని మహేష్‌రెడ్డి చెప్పారు.
మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ధైర్యంగా ఎదుర్కొంటాం.. న్యాయ పోరాటం చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెడితే అంత బలపడతాం. ఈ రోజు కొన్ని నియోజకవర్గాల్లో సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై కచ్చితంగా కేసులు పెడతాం’’ అని కాసు మహేష్‌రెడ్డి హెచ్చరించారు.