కొరాపుట్: అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాని జయపూర్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం జయపూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌డీపీఓ అర్చనా మిట్టల్ ఈ కేసు వివరాలు ప్రకటించారు. గత నెల 29 న చత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్‌కి చెందిన భవేష్ వర్మ వ్యక్తిగత పని మీద జయపూర్ వచ్చారు. అతని బైక్ దొంగలు పాలవ్వడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఈ కేసుని సవాల్ గా తీసుకొని దర్యాప్తు చేశారు. పట్టణ సమీపంలో హన్నాగుడ కి చెందిన రాహుల్ బాగ్,నందపూర్ సమితి కొదం గుడ గ్రామానికి చెందిన బలబద్ర పంగి లను అదుపు లోనికి తీసుకొని ప్రశ్నించారు. వారు తాము దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. వారిచ్చిన సమాచారం మేరకు వివిధ ప్రాంతాలలో 15 బైక్ లు రికవరీ అయ్యాయి. అందులో ఆంధ్ర ప్రదేశ్ లో సాలూరు,విశాఖ పట్నం,గుంటూరు లకు చెందిన 3 బైక్‌లు, చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 4 బైక్‌లు, ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఒక బైక్, ఒడిశాకి చెందిన 7 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మరి కొందరు నిందితులు ఉన్నారని, వారి కోసం గాలింపులు జరుగుతున్నాయని ఎస్‌డీపీఓ ప్రకటించారు. సమావేశంలో ఐఐసీ ఉల్లాస్ కుమార్ రౌత్, తదితరులు పాల్గొన్నారు.


