● నాగు పాము కాటుతో పాములు పట్టే వ్యక్తి మృతి
భువనేశ్వర్: సోషల్ మీడియాలో రీల్స్ కోసం విషపూరిత పాములతో సాహసం చేసిన ఓ వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. నాగు పామును పట్టుకుని వీడియో చిత్రీకరిస్తుండగా పాము కాటుకు గురై 28 ఏళ్ల తపన్ కుమార్ ప్రధాన్ మృతి చెందాడు. ఈ విషాద ఘటన పూరీ జిల్లాలో చోటుచేసుకుంది. పూరీ సదర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాంతాపూర్ గ్రామానికి చెందిన తపన్ పాములను పట్టడంలో నైపుణ్యం సంపాదించాడు. ఇళ్లలోకి చొరబడే పాములను పట్టుకుని సురక్షితంగా తరలించేవాడు. తన నైపుణ్యంతో పలు సందర్భాల్లో పాములను పట్టుకున్న అతడు, వాటితో ఆడుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలోనూ తరచూ పోస్ట్ చేసేవాడు. ఈ క్రమంలో తన ఇంటి వరండాలో నాగు పామును పట్టుకుని రీల్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రీకరణ సమయంలో పాము అతని వేళ్లు, మోచేయి, పై చేయిపై కాటు వేసినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు తొలుత అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం పూరీ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం చేసే సాహసాలు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారితీయవచ్చో తపన్ మృతి మరోసారి హెచ్చరిస్తోంది.


