రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితిలో 2025–26 రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు రైతుల నుంచి నగదు, ధాన్యం రూపంలో అక్రమంగా వసూళ్లు చేశారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. దాదాపు రూ.15 కోట్ల మేర రైతుల సొమ్ము దుర్వినియోగమైనట్లు రైతులు ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆహార సరఫరాల శాఖకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ గోదాములు, రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ తనిఖీల ఉద్దేశం ఏమిటి.. ఎలాంటి అంశాలపై విచారణ జరిపారు అనే విషయాల్లో స్పష్టత లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదీ విషయం
మిల్లర్లు మండీల్లోనే ప్రభుత్వ అధికారులు ఉన్న సమయంలో ఒక్కో క్వింటాల్ ధాన్యానికి ముందస్తుగా రూ.1,000లు చొప్పున్న నగదు తీసుకున్నారని, అదనంగా 5 కిలోల ధాన్యాన్ని కూడా వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై రైతులు గత జూన్ 29వ తేదీన ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పద్మపూర్‌కు చెందిన రైతు రంజన్ సబర్ మాట్లాడుతూ తన నుంచి 70 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించి రూ.70 వేల ముందస్తు నగదు తీసుకున్నారని ఆరోపించారు. ఇదేవిధంగా మరో రైతు విష్ణు గమాంగ్ కూడా తన నుంచి 75 క్వింటాళ్ల ధాన్యానికి రూ.75 వేల ముందస్తు నగదు మిల్లర్ తీసుకున్నారని పేర్కొన్నారు. పద్మపూర్ సమితిలో వందలాది మంది రైతుల నుంచి ఈ తరహాలో ముందుగానే డబ్బులు తీసుకున్నారని, అయితే భయంతో చాలామంది బయటకు వచ్చి మాట్లాడటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
పలువురు అధికారులకు ఫిర్యాదులు
మిల్లర్లపై వచ్చిన ఆరోపణలపై రైతులు విజిలెన్స్ శాఖతో పాటు కలెక్టర్, సబ్ కలక్టర్, సంబంధిత శాఖ మంత్రి తదితరులకు కూడా ఫిర్యాదు చేసి నట్లు సమాచారం. కొందరు రైతులు తమ ధాన్యం టోకెన్ నంబర్లను కూడా ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదుల అనంతరం జిల్లా యంత్రాంగం విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే విచారణ ప్రక్రియలో మిల్లర్లకు తగినంత సమయం ఇచ్చి, పెద్ద మొత్తంలో జరిగినట్లు ఆరోపిస్తున్న ఈ వ్యవహారాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని సామాజిక కార్యకర్త ప్రశాంత్ పాల్ ఆరోపించారు. రైతులు రూ.15 కోట్ల మేరకు అవకతవకలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినందున, ఈ వ్యవహారంపై ప్రభుత్వ ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఏం విచారించింది?
ఇటీవల రాయగడ జిల్లాకు వచ్చిన ఆహార సరఫరాల శాఖ ఎన్‌ఫొర్స్‌మెంట్ బృందం వివిధ సమితుల్లోని ప్రభుత్వ గోదాములతో పాటు కొన్ని రైస్ మిల్లులను సందర్శించి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అయితే బృందం ఏ ఏ అంశాలపై విచారణ జరిపింది, ఏమైనా అక్రమాలు గుర్తించిందా అనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. అంతేకాకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రభుత్వ అతిథి గృహంలో కాకుండా ఒక ప్రైవేట్ హోటల్‌లో బస చేసినట్లు సమాచారం. ఈ విషయమై గుణుపూర్ పౌరసరఫరాల శాఖ అధికారి లలిత్ మోహన్ పట్నాయక్‌ను ప్రశ్నించగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం విచారణ వివరాల కోసం జిల్లా సివిల్ సప్లయ్ అధికారి, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని సంప్రదించాలని సూచించినట్లు సమాచారం.
అత్యధిక ధాన్యం సేకరణ లక్ష్యం
జిల్లాలో రబీ ధాన్యం సేకరణలో పద్మపూర్ సమితికి అత్యధిక లక్ష్యాన్ని కేటాయించారు. జిల్లాకు మొత్తం 1,25,950 క్వింటాళ్ల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉండగా, అందులో ఒక్క పద్మపూర్ సమితికే 76,800 క్వింటాళ్ల లక్ష్యం నిర్ధేశించారు. అధిక స్థాయిలో ధాన్యం సేకరణ జరిగే పద్మపూర్‌ను జిల్లాకు ధాన్య బండాగారంగా పిలుస్తారు. ఇంత భారీస్థాయిలో ధాన్యం సేకరణ జరిగే ఈ ప్రాంతంలో రైతుల నుంచి మిల్లర్లు నగదు, ధాన్యం వసూలు చేశారన్న ఆరోపణలు రావడం, అనంతరం విచారణలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైతుల ఫిర్యాదులపై పూర్తిస్తాయి దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని రైతు సంఘాలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల
అక్రమాలు
రైతుల నుంచి అక్రమంగా వసూళ్లు
రూ.15 కోట్ల అవినీతిపై సీఎంకు ఫిర్యాదు
జిల్లాలోని ఎన్‌ఫోర్స్‌మెంట్
బృందం తనిఖీలు..?


