అత్యాచార నిందితుడు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అత్యాచార నిందితుడు అరెస్టు

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

భువనేశ్వర్‌: స్థానిక నయాపల్లి అత్యాచార కేసులో శనివారం ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నగర శివారు చందక ప్రాంతంలో పోలీసులు ఎదురు కాల్పులు జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని శ్రీధర్‌ పండాగా గుర్తించారు. అతను పోలీసుల అదుపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి పోలీసు సిబ్బందిపై కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక తూటా నిందితుడి కాలికి తగిలిందని సమాచారం. గాయపడిన నిందితుడిని చికిత్స కోసం క్యాపిటల్‌ ఆస్పత్రికి తరలించారు. ఆరోపిత లైంగిక దాడి బుధవారం రాత్రి జరిగింది. స్థానిక నయాపల్లి ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 26 ఏళ్ల మహిళను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్‌ (ఎస్సీడబ్ల్యూ) భువనేశ్వర్‌ డీసీపీ నుంచి నివేదిక కోరింది. బుధవారం రాత్రి ముసుగు ధరించిన ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు దాఖలు అయింది. 15 రోజుల్లోగా సవివర నివేదిక సమర్పించాలని మహిళా కమిషన్‌ భువనేశ్వర్‌ డీసీపీని ఆదేశించింది. ఎస్సీడబ్ల్యూ సభ్యురాలు ఊర్మిళ మహా పాత్రో నయాపల్లి పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి దర్యాప్తు అధికారులతో చర్చించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. దీనికోసం పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు భువనేశ్వర్‌ డీసీపీ శరవణ వివేక్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి క్రిస్టియన్‌ వీధి నుంచి కమవాడకు వెళ్లే ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు శుక్రవారం రాత్రి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్కన్‌గిరి పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఎంవీ 49 గ్రామానికి చెందిన జయదేవ్‌ గైన (32) ఒక ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో మల్కన్‌గిరి దిగువ వీధికి చెందిన దేవేంద్ర మాఝి, బుద్రా సోడి, ఖగేశ్వర్‌ చాలాన్‌ ముగ్గురు యువకులు ఒక బైక్‌పై తమ రోజువారీ పనులు ముగించుకుని మల్కన్‌గిరి వైపు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ ద్వారా క్షతగాత్రులందరినీ కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తలించగా.. అక్కడ వైద్యులు పరిశీలించి జయదేవ్‌ గైన్‌ మృతి చెందినట్లు నిర్దారించారు. గాయాలైన యువకులను మెరుగైన వైద్యం కోసం మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బీజేడీలో పదోన్నతులు

కొరాపుట్‌: కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాలకు చెందిన ప్రతిపక్ష బీజేడీ నాయకులకు పదోన్నతులు లభించాయి. కొరాపుట్‌ జిల్లా జయపూర్‌ పట్టణానికి చెందిన మాజీ మంత్రి రబినారాయణ నందోకి ప్యానల్‌ సీనియర్‌ ప్యానలిస్ట్‌ హోదా కల్పించారు. రాష్ట్రంలో ప్రత్యేక అంశాలపై రబినందో చర్చలు జరపనున్నారు. నబరంగ్‌పూర్‌ జిల్లాకి చెందిన మాజీ ఎంపీ ప్రదీప్‌ మజ్జికి నేషనల్‌ స్పోక్స్‌ పర్సన్‌ హోదా కల్పించారు. నబరంగ్‌పూర్‌ జిల్లాకి చెందిన మాజీ మంత్రి రమేష్‌ చంద్ర మజ్జిని స్టేట్‌ స్పోక్స్‌ పర్సన్‌గా పార్టీ నియమించింది. ఈ నియమాకాలపై ఇరు జిల్లాల్లో బీజేడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

పర్లాకిమిడిలో గ్రీవెన్సు రేపు

పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్‌లో జాయింట్‌ గ్రీవెన్స్‌ సెల్‌ సోమవారం నిర్వహించనున్నట్లు డీఆర్‌పీవో ప్రదిప్త గురుమయి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement