● ధ్వజమెత్తిన మాజీ మంత్రి
రమేష్ చంద్ర మజ్జి
కొరాపుట్: సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి స్వయంగా వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారం దాటినా ఇంకా బాధితులకు పరిహారాలు అందలేదని ప్రతిపక్ష బీజేడీకి చెందిన మాజీమంత్రి రమేష్ చంద్ర మజ్జి తీవ్ర విమర్శలు చేశారు. శనివారం కొరాపుట్ జిల్లా కోట్‌పాడ్ సమితిలో వరద ప్రభావిత ప్రాంతాలైన కర్లాహండి, లహంజ, సుర్లి, దేవ సొరుగుడ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వరదలు ప్రకృతి వలన రాలేదని, ఇంద్రావతి, మురాన్ డ్యామ్‌ల నాలుగు గేట్లు ముందస్తు సమాచారం లేకుండా ఎత్తి వేయడం వలన వచ్చాయని మండిపడ్డారు. ఇది పూర్తిగా అధికార యంత్రాంగ వైఫల్యమన్నారు. పక్కనే ఉన్న చత్తీస్‌ఘడ్‌లో ఇదే వరదల వలన నష్టపోయిన కుటుంబాలకు వెంటనే ప్రభుత్వం పరిహారాలు అందజేసిందన్నారు. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన బియ్యం కూడా ఇంతవరకు చేరలేదని దుయ్యబట్టారు. ముందు నెలలో ఇవ్వాల్సిన బియ్యం ఇచ్చారు కానీ, వరద వలన ఇస్తామన్న ప్రత్యేక కోటా ఇంకా ఇవ్వలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హయాంలో నిర్మించిన తుఫాన్ షెల్టర్లు ప్రజలకు ఈ సమయంలో కాపాడాయని గుర్తు చేశారు. ఇప్పటికీ గ్రామాల్లో ఇళ్ల నష్టం సర్వే కొనసాగుతోందని, ఇంకా సర్వేలోనే కాలం గడిస్తే పరిహారాలు ఎప్పుడు అందుతాయని ప్రశ్నించారు. పలుచోట్ల ప్రజలకు టవల్స్, బిస్కెట్లు, అటుకులు పంపిణీ చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పద్మిని దియాన్, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మజ్జి తదితరులు ఉన్నారు.


