రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధిలో గల రొబాడి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వసతి గృహంలో కామెర్ల (జాండీస్) కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతుంది. జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో దశల వారీగా దాదాపు వంద మంది విద్యార్థినులు కామెర్లతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. పాఠశాల ఆవరణలోని చేతిపంపు నీటిని తాగిన అనంతరం విద్యార్థినులు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే చేతిపంపు నీటి వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా విద్యార్థినులకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించడంతోపాటు అస్వస్థతకు గురైన విద్యార్థినులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. వారిలో ఓ విద్యార్థి ఆరోగ్య పరిస్దితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బరంపురం ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మరో నలుగురు విద్యార్థినులను చికిత్స నిమిత్తం రాయగడ జిల్లా ప్రధాన హాస్పిటల్‌లో చే ర్పించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. పాఠశాలలొ ప్రతిరోజూ ఆరోగ్య శాఖకు చెందిన ప్రత్యేక బృందం పర్యటించి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్ తెలిపారు. వరుసగా విద్యార్థినులు అనారోగ్యానికి గురవుతుండటంతో వసతి గృహంలో భయాందొళన వాతావరణం నెలకొంది. కొంతమంది విద్యార్థినులు హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం.


