రూ.6.15 లక్షలు సాయం | - | Sakshi
Sakshi News home page

రూ.6.15 లక్షలు సాయం

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026
12 మంది రోగులకు

19వ ముఖ్యమంత్రి ప్రజాభియోగ శిబిరం

భువనేశ్వర్‌: యూనిట్‌–2లోని ముఖ్యమంత్రి సమస్యల పరిష్కార గదిలో సోమవారం 19వ ముఖ్యమంత్రి సమస్యల పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ విడతకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో 700కు పైగా ఫిర్యాదులు దాఖలయ్యాయి. ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీతో పాటు మంత్రి వర్గంలోని 6 మంది సీనియర్‌ మంత్రులు కూడా హాజరై ప్రజల సమస్యలను విన్నారు. తొలుత బయట వేచి ఉన్న దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిసి ముఖ్యమంత్రి వారి సమస్యలను విన్నారు. వారి ఫిర్యాదులు అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని అక్కడ అందుబాటులో ఉన్న అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత సమస్య విచారణ గది లోపల వేచి ఉన్న ఫిర్యాదుదారుల సమస్యలను విన్నారు. సోమ వారం జరిగిన సమస్య పరిష్కార శిబిరంలో ముఖ్యమంత్రి సింగిల్‌ విండో సిస్టమ్‌ ద్వారా వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సుమారు 12 మందికి వైద్య సహాయంగా రూ. 6.15 లక్షలు తక్షణమే మంజూరు చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి సమస్య స్థితిగతులన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. దీని వల్ల పరిష్కార రేటు పెరగడంతో ఈ వ్యవస్థపై సామాన్య ప్రజల విశ్వాసం పెరుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇంతకు ముందు నిర్వహించిన 18 విడతలలో ప్రజా ఫిర్యాదుల విభాగానికి అందిన 14,941 ఫిర్యాదులలో 14,331 అంటే 96 శాతం ఫిర్యాదులు విజయవంతంగా పరిష్కరించామని తెలిపారు. దీంతో పాటు జిల్లా స్థాయిలో జిల్లా మేజిస్ట్రేట్‌, పోలీసు సూపరింటెండెంటు ప్రజల ఫిర్యాదులను క్రమం తప్పకుండా వింటుండగా తహసీల్‌, మండల స్థాయిలలో కూడా ప్రజా ఫిర్యాదుల విచారణలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ నెలాఖరు నాటికి జిల్లా స్థాయిలో 2,59,213 ఫిర్యాదులను పరిశీలించి 89 శాతం సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రితో పాటు, రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ కుమార్‌ పూజారి, పాఠశాలలు, మాధ్యమిక విద్య, షెడ్యూల్డ్‌ తెగలు, కులాల అభివృద్ధి శాఖ మంత్రి నిత్యానంద్‌ గోండ్‌, వాణిజ్య, రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్‌ జెనా, పంచాయతీ రాజ్‌, తాగు నీరు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి రవి నారాయణ్‌ నాయక్‌, పరిశ్రమలు, నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి సంపద చంద్ర స్వంయి, మత్స్య, పశు సంపద అభివృద్ధి శాఖ మంత్రి గోకులనంద్‌ మల్లిక్‌ ప్రత్యక్షంగా హాజరై ప్రజల సమస్యలను విన్నారు. హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్‌ శర్మ, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శాస్వత్‌ మిశ్రా, ప్రజా ఫిర్యాదులు మరియు ప్రజా పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌ వశిష్ఠ, ఇతర శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి సీనియర్‌ అధికారులు హాజరై ఫిర్యాదుల విచారణ ప్రక్రియలో సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement