రాయగడ: జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు టికిరి–రౌలీ రైల్వే స్టేషన్‌ల మధ్య రైల్వే ట్రాక్‌పై సుమారు మూడు అడుగుల మేర వరద నీరు చేరింది. ట్రాక్ పూర్తిగా నీట మునిగిపోవడంతొ కొరాపుట్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలును టికిరి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో టికిరి స్టేషన్ కు చేరుకున్న ఈ రైలు దాదాపు నాలుగు గంటలుగా అక్కడే నిలిచిపోయింది. దీంతో వందలాది మంది ప్రయాణికులు రైలులోనే చిక్కుకుపోయి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాల కారణంగా కొండల నుంచి వచ్చిన వరద నీరు, బురద రైల్వే పట్టాలపై చేరడంతో పాటు ట్రాక్ పక్కనున్న డ్రైనేజీ నీరు కూడా పట్టాలపై నిలిచిపోయింది. దీంతో రైల్వే అధికారులు భద్రత కారణాల వల్ల రైలు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. రౌలి స్టేషన్ సమీపంలో కూడా ట్రాక్ వర్షపు నీరు నిల్వ ఉండటంతో పరిస్థితిని అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. వర్షం తగ్గిన అనంతరం రైల్వే ట్రాక్‌ను పూర్తిగా తనిఖీ చేసి భద్రత పై నిర్ధారణకు వచ్చిన తర్వాతే రైలు ప్రయాణాన్ని పునః ప్రారంభిస్తామని రాయగడ రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం పరిస్థితిని రైల్వే సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


