భువనేశ్వర్: బిజూ జనతా దళ్ (బీజేడీ) నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి సుశాంత సింగ్ (53) కన్ను మూశారు. స్థానిక అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. సుశాంత్ సింగ్ దీర్ఘ కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన 2009, 2014, 2019లో భట్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేడీ శాసన సభ సభ్యులుగా ఎన్నిక అయ్యారు. ఆయన ఒడిశా ప్రభుత్వంలో కార్మిక, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పదవి బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. భట్లి శాసన సభ నియోజక వర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బిజూ జనతా దళ్ (బీజేడీ)తో పాటు పలు ఇతర రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేసి సంతాపం తెలిపారు.
నదిలో చిక్కుకున్న
ప్రయాణికుల పడవ
భువనేశ్వర్: భద్రక్ జిల్లా చాంద్‌బాలి మండలం పంచుటికిరి ఘాట్ సమీపంలో నది మధ్యలో ప్రయాణికులతో ఉన్న పడవ చిక్కుకుంది. సోమవారం జరిగిన ఈ సంఘటన ప్రయాణికులను బెంబేలెత్తించింది. నది గర్భంలో దట్టమైన నీటి కలుపు మొక్కలలో చిక్కుకుపోవడంతో పడవ ముందుకు వెళ్లడం అసాధ్యమైందని బాధితులు వాపోయారు. పలువురు ప్రయాణికులతో వెళ్తున్న పడవ 2 గంటలకు పైగా నది మధ్యలో నిలిచిపోయింది. ఈ సంఘటన గురించి స్థానిక నివాసితులకు, అధికారులకు తెలియజేయడంతో పడవతో నది నడి బొడ్డున చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించేందుకు ప్రయ త్నాలు ప్రారంభించారు. పడవకు ఒక తాడు కట్టి పలువురు కలిసి ఆ పడవను నదీ తీరం వైపు లాగారు. అదృష్టవశాత్తు పడవలోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.


