సర్పంచ్‌ల మహా సంఘం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ల మహా సంఘం ఆందోళన

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

సర్పంచ్‌ల మహా సంఘం ఆందోళన

రాయగడ: ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలో మహాకాళపడ సమితి తిఖిరి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ చామేలి ఓఝాపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో రాయగడ జిల్లా సర్పంచ్‌ల మహాసంఘం కలెక్టర్‌ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. అనంతరం ఏడీఎం నవీన్‌ చంద్ర నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. తిఖిరి గ్రామ పంచాయతీకి చెందిన మహిళ సర్పంచ్‌ చామేలి ఓఝా ఈనెల 11వ తేదీన తన పంచాయతీ అభివృద్ధి పనులపై చర్చించేందుకు మహాకాళపడ సమితి బీడీవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరుగుతున్న సమయంలో.. బీడీవోతో పాటు మరి కొందరు అధికారులు ఆమైపె అనుచిత వ్యాఖ్యలు చేశారని సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. అనంతరం బీడీవో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిష్కరించాల్సిపోయి.. పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశారని ఆరోపించారు. చామేలి ఓఝాను బలవంతంగా పోలీసులు వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారని, ఆ సమయంలో ఆమె సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకోవడంతో పాటు శారీరకంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమైపె తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు సంఘం ప్రతినిధులు ఆరోపించారు. మానసిక, శారీరక వేధింపుల కారణంగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, ప్రజా ప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించారని సర్పంచ్‌ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో చట్ట వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోందని పేర్కొంటూ గవర్నర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. హలువ సర్పంచ్‌ తమ్మారావు బిడిక నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. సర్పంచ్‌లు, మహిళా సర్పంచ్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసను వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement