ఘనంగా వినాయక ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వినాయక ఆలయ వార్షికోత్సవం

Jun 20 2026 11:43 AM | Updated on Jun 20 2026 11:43 AM

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని రాజువీధిలో ఉన్న సిద్ధి వినాయక దేవాలయ 15వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు సూర్యాఆరాధనతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేయి నామ యజ్ఞాలు, హోమాలు జరిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. 15 ఏళ్లుగా వార్షికోత్సవాన్ని కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పెద్దఎత్తున భక్తులు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు.

వైభవంగా శివ పార్వతుల కల్యాణం

జయపురం: స్థానిక రాజుసాహి పంచానన శైవపీఠం అష్టశంభు క్షేత్రంలో శివ పార్వతుల కల్యాణాన్ని వైభవంగా గురువారం సాయంత్రం నిర్వహించారు. మందిర సాంప్రదాయం ప్రకారం ముందుగా మంగళ పూజలు, పంచ దేవతల పూజలు జరిపారు. మహా శివుడిని శివ మందిరం నుంచి అందమైన పల్లకీలో పట్టణంలో ఊరేగించారు. కార్యక్రమంలో పూజా కమిటీ సభ్యులు, మందిర ప్రధాన పూజారి చంద్రశేఖర భటమిశ్ర, సేవాయత్‌ సత్యనారాయణ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

విజిలెన్స్‌ దాడులు

జయపురం: సబ్‌ డివిజన్‌ పరిధి కోట్‌పాడ్‌ సమితిలో అదనపు కార్య నిర్వాహక ఇంజినీర్‌ సత్యనారాయణ సెఠి ఆస్తులపై ఒడిశా విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఇంజినీర్‌ సత్యనారాయణ సెఠిపై రావడంతో విజిలెన్స్‌ అధికారులు దాడులు చేపట్టారు. ఏకకాలంలో శ్రీసెఠికి సంబంధించిన ఆస్తులు ఉన్నటువంటి ఏడుచోట్ల దాడులు జరుపుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ దాడుల్లో ఏడుగురు విజిలెన్స్‌ డీఎస్పీలు, 9 మంది విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్లు, 11 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. దీనిలో భాగంగా అక్రమ ఆస్తులు, నగదు, బంగారు ఆభరణాలు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

నాటుబాంబు పేలుడు

భువనేశ్వర్‌: ఢెంకనాల్‌ జిల్లా గండతైల గ్రామంలో నాటు బాంబు పేలడంతో యువకుడు రెండు అరచేతులు కోల్పోయాడు. జంతువుల వేట కోసం బాంబు సిద్ధం చేస్తుండగా అకస్మాత్తుగా బాంబు పేలినట్లు సమాచారం. ఆ సమయంలో అతడికి చేరువలో ఉన్న మరో 2 మంది యువకులు గాయపడ్డారు. వారిరువురు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. బాధితుడు గండతైల దళిత బస్తీకి చెందిన బీరేంద్ర నాయక్‌గా గుర్తించారు. పర్జంగ్‌ ఠాణా పోలీసులు, దిహాడోల్‌ ఫారెస్టర్‌ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు

భువనేశ్వర్‌: రాజధాని నగరంలో పెట్రోల్‌, డీజిల్‌ ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌ ధర లీటరుకు రూ.108.81లుగా, డీజిల్‌ ధర లీటరుకు రూ.100.52లుగా శుక్రవారం నమోదైంది. గత 24 గంటల్లో ఇంధన ధరలు రూ.0.41 పైసలు తగ్గాయి.

కటక్‌ నగరంలో గత 24 గంటల్లో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్‌ ధర లీటరుకు రూ.109.35గా, డీజిల్‌ ధర లీటరుకు రూ.101.04లుగా ఉంది. గత 24 గంటల్లో ఇంధన ధరలు 0.20 పైసలు పెరిగాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement