రాయగడ: స్థానిక కపిలాస్ కూడలి వద్ద ఒక కారు అదుపుతప్పి ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ సమీపంలోని డివైడర్‌ను ఢీకొట్టింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనుంచి రైల్వే స్టేషన్ రోడ్డు మార్గం వైపు వెళుతున్న సమయంలో కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అక్కడి వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కారును బయటకు తీసే ప్రయత్నం చేశారు. వేగంగా కారును నడపడంతోనే ప్రమాదం జరిగి ఉంచవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
ఐఏఎస్ కేడర్‌లో స్వల్ప మార్పులు
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారుల స్థాయిలో స్వల్ప మార్పులు చేపట్టింది. 2 మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. సాధారణ పాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కార్మిక – ఈఎస్‌ఐ శాఖ, సైన్స్–టెక్నాలజీ శాఖలో అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ గోపబంధు అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో డైరెక్టర్ జనరల్, ట్రైనింగ్ కోఆర్డినేషన్‌గా కూడా పనిచేస్తున్న 1995 సంవత్సరపు ఐఏఎస్ అధికారి చిత్ర అరుముగంను గోపబంధు అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో డైరెక్టర్ జనరల్, ట్రైనింగ్ కోఆర్డినేషన్‌గా నియమించారు. ఆమె సైన్స్–టెక్నాలజీ శాఖలో ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు కొనసాగిస్తారు. కేంద్ర డిప్యుటేషన్ నుంచి తిరిగి వచ్చిన 2001 సంవత్సరపు ఐఏఎస్ అధికారి దొడ్డ వెంకట స్వామి ప్రభుత్వ కార్మిక, ఈఎస్‌ఐ శాఖకు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.


