ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

Jun 17 2026 12:58 AM | Updated on Jun 17 2026 12:58 AM

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 17 శ్రీ జూన్‌ శ్రీ 2026
‘ఎల్‌ నినో’ ఎదుర్కోవడానికి ..
నీట్‌ పునఃపరీక్ష సజావు నిర్వహణకు సన్నాహాలు

భువనేశ్వర్‌ : ఈ ఏడాది ఖరీఫ్‌ పంట కాలానికి సన్నద్ధత, ఎల్‌ నినో వల్ల సంభవించే ప్రభావాన్ని ప్రభుత్వం సమీక్షించింది. ఈ సందర్భంగా ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా నీటి లభ్యతను కోసం ముందస్తు ప్రణాళిక, సమన్వయ చర్యలు చేపట్టాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఆమె అధ్యక్షతన లోక్‌ సేవా భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నైరుతి రుతు పవన వర్షాల పరిస్థితి, ఈ సీజన్‌కు సంబంధించిన అంచనాలు, ఎల్‌ నినో పరిస్థితుల వల్ల తలెత్తే ఏవైనా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన ఆకస్మిక చర్యలపై చర్చించారు. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ప్రకారం రుతు పవనాలు కోస్తా ఒడిశా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు తాకాయి. ఇతర ప్రాంతాల్లో వర్షపాతానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఎల్‌ నినో కారణంగా దేశ వ్యాప్తంగా సాధారణం కంటే కొద్దిగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ గత విశ్లేషణ ప్రకారం ఒడిశాపై దీని ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. ఎల్‌ నినో పరిస్థితులు పొంచి ఉన్నప్పటికీ రాష్ట్రంలో వర్షపాతం సాధారణం, సాధారణం కంటే కొంచెం తక్కువగా లేదా సాధారణం కంటే ఎక్కువగా కూడా ఉండవచ్చని అధికారులు తెలియజేశారు. అయితే వర్షపాతం లోటు ఏర్పడే ఏ పరిస్థితిని అయిన పూర్తిస్థాయి సన్నద్ధతతో ఎదుర్కోవాలని ప్రముఖ కార్యదర్శి అధికారులకు తెలియ జేశారు. ముందస్తు ఆకస్మిక ప్రణాళికల్లో భాగంగా వర్షపాత సరళి, జలాశయాల నీటిమట్టాలు, వ్యవసాయ కార్యకలాపాలు, నీటి వనరులను నిరంతరం పర్యవేక్షించాలని ఆమె శాఖలను ఆదేశించారు. సమావేశంలో ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో నీటి సంరక్షణ, సూక్ష్మ నీటిపారుదల, జలాశయాల సమర్థవంతమైన నిర్వహణకు సంబంధించిన వ్యూహాలను కూడా సమీక్షించారు. భూ గర్భ జలాల సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో భూగర్భ జలాల పునరుజ్జీవనం, అవగాహన కల్పన కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వర్షపాతం లోటు ఏర్పడిన సందర్భంలో తెగుళ్లు, వ్యాధుల నిర్వహణ చర్యలను పటిష్టం చేయడంలో అనుబంధ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలవనరుల శాఖ నోడల్‌ శాఖగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లకు నీటి పారుదల ప్రణాళికను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన కార్యాచరణ. నీటి పారుదల సామర్థ్యం పెంపు, సమర్థవంతమైన నీటి వినియోగంపై రైతులలో అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది. నీటి లభ్యత, నీటి పారుదల, జల వనరుల నిర్వహణ కార్యకలాపాలు నిరంతరం సమీక్షిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 57.88 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం. ఇందులో 39.04 లక్షల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్‌ కమ్‌ కార్యదర్శి సచిన్‌ రామచంద్ర యాదవ్‌ తెలిపారు. ఈ సీజన్‌లో 2,66,780 క్వింటాళ్ల విత్తనాల సరఫరా ప్రణాళికలో భాగంగా 1,18,787 క్వింటాళ్లకు పైగా విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు అదనంగా 14,350 క్వింటాళ్ల విత్తనాలను నిల్వ అందుబాటులో ఉంచారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు రాష్ట్రానికి 11.43 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం. ఈ మేరకు అన్ని జిల్లాల్లో నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సహకార శాఖ తెలియజేసింది. ఎరువుల పంపిణీలో అవకతవకల నివారణకు నిరంతర పర్యవేక్షణతో సమీక్షిస్తారు. జిల్లా, మండల స్థాయిలలో నిఘా బృందాలు పని చేస్తాయి. ప్రస్తుత సీజన్‌లో ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన కింద సుమారు 25 లక్షల మంది రైతులను చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అరవింద కుమార్‌ పాఢి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శుభా శర్మ, వ్యవసాయ,రైతు సాధికారత శాఖ కమిషనర్‌ కమ్‌ కార్యదర్శి సచిన్‌ రామచంద్ర యాదవ్‌, సహకార శాఖ కమిషనర్‌ కమ్‌ సెక్రటరీ, ప్రత్యేక సహాయ కమిషనర్‌ రాజేష్‌ ప్రభాకర్‌ పాటిల్‌, ఐఎండీ ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోరమ మహంతి, ఒడిశా వ్యవసాయ మరియు సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌, వివిధ శాఖల సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement