పూరీ బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లో చత్తీస్‌గఢ్‌ బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

పూరీ బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లో చత్తీస్‌గఢ్‌ బాలుడు మృతి

Jun 17 2026 12:58 AM | Updated on Jun 17 2026 12:58 AM

● ఇద్దరు డ్రైవర్లు మృతి

భువనేశ్వర్‌: పూరీలోని బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన అలల ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయిన మైన ర్‌ బాలుడు మృతి చెందాడు. మృతుడు చత్తీస్‌గఢ్‌కు చెందిన పర్యాటకుడు పియూష్‌ కుమార్‌గా గుర్తించారు. సహాయం కోసం కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు విని విధుల్లో ఉన్న లైఫ్‌గార్డ్‌ తక్షణమే స్పందించి నీటి లోకి దూకి ఆ బాలుడిని రక్షించాడు. ఒడ్డుకు చేర్చిన బాధిత బాలుని పూరీ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు అతడు మరణించినట్లు ప్రకటించారు. పోస్ట్‌మార్టం పూర్తి చేసి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

ఎదురెదురుగా వచ్చిన ట్రాలర్లు ఢీ

భువనేశ్వర్‌: సుందర్‌గఢ్‌ జిల్లా 10వ నంబర్‌ జాతీయ రహదారి కొంయితర సమీపంలో 2 ట్రాలర్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో వాటిలో మంటలు చెలరేగాయి. మంటల్లో 2 ట్రాలర్లలోని ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు. ఝార్సుగుడ నుంచి సుందర్‌గఢ్‌ వైపు వెళ్తున్న ట్రాలర్‌ అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను దాటడంతో.. ఎదురుగా సుందర్‌గఢ్‌ నుంచి ఝార్సుగుడ వైపు ఎదురుగా వస్తున్న మరో ట్రాలర్‌ను ఢీకొంది. ఆ ధాటికి ఒక ట్రాలర్‌లో డీజిల్‌ ట్యాంక్‌ పగిలిపోవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో చెలరేగిన మంటలు అతి వేగంగా రెండు వాహనాలను చుట్టుముట్టాయి. స్వల్ప వ్యవధిలో రెండు వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, భస్మ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రెండు వాహనాల ఇద్దరు డ్రైవర్లు లోపలే చిక్కుకుపోయి అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మృతి చెందిన ఇద్దరు డ్రైవర్ల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు.

మునిగుడలో వినతుల స్వీకరణ

రాయగడ: జిల్లాలోని మునిగుడలో ఏడీఎం నవీన్‌ చంద్ర నాయక్‌ అధ్యక్షతన వినతుల స్వీకరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎస్పీ రాజ్‌ ప్రసాద్‌, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్‌ కెముండో, గుణుపూర్‌ సబ్‌ కలెక్టర్‌ దుదూల్‌ అభిషేక్‌ అనిల్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. సమితిలోని వివిధ ప్రాంతాల నుంచి 81 వినతులను స్వీకరించారు. గ్రామ సమస్యలను పరిగణలోకి తీసుకుని త్వరితగతిన సమస్యలను పరిష్కరించేలా, సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏడీఎం నవీన్‌ చంద్ర నాయక్‌ ఆదేశించారు.

ఘాట్‌ రోడ్డులో రెండు బస్సులు ఢీ

పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్‌.ఉదయగిరి బ్లాక్‌ మెట్టిఅంబ గ్రామం ఘాటీ మలుపు వద్ద మంగళవారం రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయపడగా, మరో 50మంది ప్రయాణికులు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆర్‌.ఉదయగిరి పోలీసుల సమాచారం మేరకు.. గంజాం జిల్లా నుంచి ఆర్‌.ఉదయగిరికి వస్తున్న ప్రైవేటు బస్సు బాలకుమారి బస్సు, రాయగడ జిల్లా నుండి చికిటీ మీదుగా వస్తున్న గిరిధరి బస్సు మెట్టి అంబ గ్రామం వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయని ఆర్‌.ఉదయగిరి పోలీసులు అధికారి రాకేష్‌ కుమార్‌ సాహు తెలియజేశారు. ఈ సంఘటన జరిగిన అనంతరం స్థానికుల సహాయంతో గాయపడిన ముగ్గురిని చంద్రగిరి ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారు. ఘాటీ రోడ్డులో తరచూ ఇలాంటి ప్రమాదాలకు గురిచేస్తున్న రోడ్డు ప్రక్కల ఆర్‌.అండ్‌ బీ అధికారులు భద్రత హెచ్చరికల బోర్డులు ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement