రాష్ట్రపతి, ప్రధాన మంత్రి పర్యటన
భువనేశ్వర్:
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పన్నెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ ఉన్నత స్థాయి పర్యటన పురస్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక లోక్ సేవా భవన్‌లో మంగళ వారం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన బ్లూప్రింట్, భద్రతా ఏర్పాట్లపై వివరంగా చర్చించారు. ముఖ్యంగా భారీ బహిరంగ సభ, వీవీఐపీల రాకపోకల సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రపతి జన్మ దినోత్సవం
ముఖ్యమంత్రి సమీక్ష ప్రకారం ఈ నెల 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత జిల్లా మయూర్‌భంజ్ 2 రోజుల పర్యటనకు రానున్నారు. జూన్ 20 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జన్మ దినం సందర్భంగా రాష్ట్రపతి తన జన్మస్థలం, తొలి కర్మ క్షేత్రం అయిన రాయరంగపూర్ పర్యటించడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వస్థలంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20న రాయరంగపూర్‌కు విచ్చేసి చారిత్రాత్మక రాష్ట్ర స్థాయి భారీ కార్యక్రమంలో రాష్ట్రపతితో కలిసి పాల్గొంటారు. జాతీయ స్థాయిలో ఇద్దరు అగ్ర స్థాయి నాయకులు రాష్ట్రంలో ఒకే వేదికపై ప్రసంగించడం గొప్ప విశేషంగా ముఖ్యమంత్రి తెలిపారు. మయూర్‌భంజ్ జిల్లా రాయరంగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో భారత రాష్ట్రపతి మరియు ప్రధాన మంత్రి సంయుక్తంగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సంయుక్త పర్యటన రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని మరింత పెంచుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేదిక నుంచే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఇద్దరూ కలిసి ఒడిశా, మయూర్‌భంజ్ జిల్లాల కోసం వేల కోట్ల రూపాయల విలువైన ముఖ్యమైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించనున్నారు. మరో వైపు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైల్వే ప్రాజెక్ట్, మెగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 19న రాయరంగ్‌పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్ మిశ్రా, ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా, అభివృద్ధి కమిషనర్ డీకే సింగ్, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శాశ్వత్ మిశ్రా, హోం శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖల అదనపు ప్రధాన కార్యదర్శులు హేమంత్ శర్మ, ఇంటెలిజెన్స్ డీజీ బినయతోష్ మిశ్రా హాజరయ్యారు.


