సాగుకు సన్నద్ధం..
● ఏరువాకకు ముందే యూరియా గుబులు
● ఖరీఫ్‌కు తగినంత అందించలేమంటున్న ప్రభుత్వం
● అన్నదాతలో ఆందోళన
నిబంధనలు ప్రకారమే సరఫరా
ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రైతులకు యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ ఏడాది యూరియా దిగుమతి తగ్గే అవకాశం ఉంది. అధిక ధరలకు విక్రయించినవారిపై చర్యలు తీసుకుంటాం.
– ఎం.మోహనరావు, వ్యవసాయశాఖాధికారి, ఆమదాలవలస మండలం
తగిన యూరియా అందించాలి
ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూడడం సరికాదు. రైతులకు కావాల్సిన ఎరువులు అందించకపోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులే కాకుండా ముఖ్యంగా కౌలు రైతులూ ఇబ్బందిపడే ప్రమాదం ఉంది. దీంతో అధిక నష్టం జరుగుతుంది. అందువలన ప్రభుత్వం ఆలోచించి తగిన యూరియా అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
– పి.రాము, రైతు, వంజంగిపేట, ఆమదాలవలస
ఆమదాలవలస రూరల్: అన్నదాత గుండెల్లో యూరియా గుబులు మొదలయ్యింది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు తగిన యూరియా అందించలేమని ప్రభు త్వం చేతులెత్తేయడంతో సాగుపై భయం నెలకొంది. ఎకరానికి ఒక బస్తా లేదా ఎకరాన్నరకు ఒక బస్తా చొప్పున మాత్రమే ఈ ఏడాది యూరియా అందించగలమని అధికారులు ముందే చెప్పడంతో గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఈ ఏడాది పంటలు ఎలా పండించాలోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తొలకరి వర్షాలు ప్రారంభమవ్వడంతో ఏరువాకకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి మన ప్రాంతంలో ఎకరానికి రెండు లేదా మూడు బస్తాల యూరియాతో పాటు తగిన కాంప్లెక్స్ ఎరువులు వేస్తే కానీ పంట దిగిబడులు వచ్చే అవకాశం లేదు. అయితే అధికారులు ముందుగానే రైతులకు తగిన యూరియా అందించలేమని చెప్పడంతో అన్నదాతలు భయాందోళన చెందుతున్నారు.
భారీగానే నిల్వలు
వాస్తవంగా జిల్లాకు పలు కంపెనీల నుంచి ఏజెన్సీలు ఉన్నాయి. రైల్వే వ్యాగన్లు ద్వారా ఆమదాలవలస పట్టణానికి యూరియా దిగుమతి అవుతోంది. అయితే ఈ ఏడాది యూరియా కొరత ఉండవచ్చని ముందుగానే గ్రహించిన ఏజెన్సీలు ముందు నుంచి భారీ నిల్వలకు ప్రణాళికలు చేశారు. పలు ప్రభుత్వ గోదాంలతో పాటు అనేక ప్రైవేటు గోదాంలు లీజ్‌కు తీసుకొని భారీ నిల్వలు వేస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలో చెందిన వ్యాపారులకు పలు ఏజెన్సీల నుంచి అందించడం జరుగుతుంది. అయితే ముందస్తుగానే నిల్వలు పెంచుకొని రైతులు నుంచి భారీ వసూళ్లకు ఏజెన్సీదారులు, వ్యాపారులు కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కృత్రిమ కొరతతో దోపిడి
స్థానికంగా ఉండే కొందరు వ్యాపారులు ఏజెన్సీదారులతో కలిసి ఇప్పటినుంచే కృత్రిమ కొరత సృష్టించి అన్నదాతల నుంచి భారీ దోపిడీకి పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బస్తాకు మీకు ఇంత.. మాకు ఇంత అని వ్యాపారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇంకా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ప్రభుత్వ ధర ప్రకారం రూ.278 లకు విక్రయించాల్సిన యూరియా బస్తా రూ.500ల నుంచి రూ.550ల వరకు ధర పలుకుతోంది. అంటే ఇక ఖరీజ్ సీజన్ ప్రారంభమైతే బస్తా ధర ఏ స్థాయిలో ఉంటుందో అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారుల కళ్లెదుటే ఈ వ్యవహారం జరుగుతున్నా చోధ్యం చూస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందువలన ఇప్పటికై నా వ్యవసాయశాఖ విజిలెన్స్ అధికారులు రంగ ప్రవేశం చేసి ఽయూరియాపై ధరలు నియంత్రణ చేయకపోతే, అన్నదాతలకు అవస్థలు తప్పవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


