మహేంద్ర మేళాను సందర్శించిన శ్రీనివాసానంద సరస్వతి | - | Sakshi
Sakshi News home page

మహేంద్ర మేళాను సందర్శించిన శ్రీనివాసానంద సరస్వతి

Jun 4 2026 5:34 AM | Updated on Jun 4 2026 5:34 AM

మహేంద్ర మేళాను సందర్శించిన శ్రీనివాసానంద సరస్వతి

పర్లాకిమిడి: పవిత్రమైన మహేంద్రగిరి పర్వతంపై జరుగుతున్న యజ్ఞాలు, మేళాను ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి బుధవారం సందర్శించారు. ఆయనతో క్రాంతి మహారాజ్‌ (రాయగడ), పాతపట్నం బీజేపీ మండల నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, గోసమ్మాన్‌ అభియాన్‌ జిల్లా కార్యదర్శి (గజపతి) రమేష్‌ చంద్ర పాత్రో, మానవహక్కుల సంఘం నాయకులు లక్ష్మీకాంత పాఢి ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తిరిగి పునర్జన్మ ఉండదన్నారు. ఎక్కడో హిమాలయాల వద్ద ఉన్న కేదారేశ్వర స్వామిని అధిక ఖర్చుతో దర్శించుకుంటారని.. కానీ దగ్గరలో ఉన్న మహేంద్రంను దర్శించుకుని ఇక్కడ జరుగుతున్న యజ్ఞ యాగాదులు చూసి తరించాలని కోరారు. స్వామి శ్రీనివాసానంద సరస్వతికి అఖిలభారత యువజన సేవాసమితి అధ్యక్షులు గిన్ని కూర్మారెడ్డి, బీజేపీ నాయకులు శాసనం లింగరాజు, శ్రీకాంత్‌ రెడ్డిలు దుశ్శావలతో సన్మానించారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

పర్లాకిమిడి: ఎస్పీ మీనా ఆదేశాల మేరకు గజపతి స్టేడియం, ఫారెస్టు గేటు వద్ద మంగళవారం రాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. పలువురు పట్టుబడటంతో రూ.1,23,000 జరిమానా విధించారు. జిల్లాలో పలు పోలీసు స్టేషన్‌ పరిధిలో రాత్రివేళ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చర్యలు చేపడుతున్నారు.

కొత్త బస్టాండ్‌లో సౌకర్యాలు కల్పించాలి

జయపురం: జయపురం కొత్త బస్టాండ్‌లో ఏటీఎం కౌంటర్‌, డార్మిటరీలు వంటి సౌకర్యాలు కల్పించాలని బీజేడీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం జయపురం మాజీ మంత్రి రబినారాయణ నందో నేతృత్వంలో పలువురు యువ కార్యకర్తలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు డీటీఎం ఆరోశ్రీ సాహును కలిసి వినతిపత్రం అందించారు. బస్టాండ్‌ ప్రారంభించి రెండేళ్లు గడిచినా ఇంతవరకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తగదన్నారు. కార్యక్రమంలో కొరాపుట్‌ జిల్లా బీజేడీ కార్యనిర్వాహక అధ్యక్షులు దుర్గా మిశ్ర, మున్సిపల్‌ కౌన్సిలర్లు లక్ష్మినారాయణ, దేవేంద్ర చౌదురి, సత్యాదన మహానందియ, సుజిత్‌ కుమార్‌ పాణి, పి.కృష్ణ, బాగ్యానంద నాగ్‌, కె.శ్రీనివాసరావు, శివపట్నాయిక్‌, మహేంద్ర అధికారి, హిమాంశు చంద్ర చౌదురి తదితరులు పాల్గొన్నారు.

ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి

మల్కన్‌గిరి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని మల్కన్‌గిరి జిల్లా యువ బీజేడీ, విద్యార్థి బీజేడీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీజేడీ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీనివాసు ముదిలి బుధవారం కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ రాజాశిర్కేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక ర్యాంపులు గడువు ముగిసినా ఇసుక మాఫియా వందలాది వాహనాల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా చూపుతూ తనిఖీలు నిర్వహించకపోవడం తగదన్నారు. ఇప్పటికై నా అక్రమ రవాణా అరికట్టాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మనాస్‌ మడ్కామి, జిల్లా కార్యదర్శి కె.రాహుల్‌, అధిడు సుబ్రత్‌కుమార్‌ దాస్‌, సుదర్శన్‌ కోపే, రాకేష్‌ మండల్‌, గౌరవ్‌ సగాడియా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement